సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్పోర్టస్ అథారిటీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : హైదరాబాద్ లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం న్యూదిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్టస్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, గడ్డం వంశీ, ఆర్. రఘుమా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా 57 ఏళ్ల తర్వాత ఫుట్ బాల్ క్రీడలో హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వడం సంతోషకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 14 నుంచి 31 వరకు దాదాపు 37 వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొంటున్నట్లు స్పోర్టస్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు తెలంగాణ స్పోర్టస్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.