ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండాలి

– కార్యకర్తలకు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఉద్బోధ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తల పాత్రపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ మూడు అంశాలపై నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకోబోతున్న సమయంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై మేరా భారత్ – మేరా యోగదాన్ (దేశానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించడం) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత నెలకొనగా అనేక దేశాలు ఇంధన ధరలను భారీగా పెంచాయని, కొన్ని దేశాల్లో రేషన్ విధానం కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం పడకుండా చూసిందన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంధన వినియోగంలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చేయాలని, కార్‌పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ను కూడా అనుసరించాలని సూచించారు. తాను కూడా ఈరోజు విద్యుత్ కారులో వచ్చానని, ఇది ప్రచారం కోసం కాదు.. దేశ ప్రయోజనం కోసం.. మన జీవన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందనే సందేశం ఇవ్వడంతోపాటు ప్రధాని మోదీ సందేశాన్ని ఆచరణలో పెట్టడానికేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు కూడా ఈ దిశగా ఆలోచించాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ ‘ఒక చెట్టు – అమ్మ పేరు మీద’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం స్థానిక ఉత్పత్తులను వినియోగించాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ముందుకు సాగాలని కోరారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలన్నారు.

బీఆర్ఎస్‌పై విమర్శల దాడి

బీఆర్ఎస్ వంటి పార్టీల వైఖరి వల్ల రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తిని, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఖర్చుతో పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం, అనుకూల మీడియా ద్వారా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, ఒకవేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పు చేసి ఉంటే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ ఇక్కడ జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించింది. వారు తప్పు చేసి ఉంటే చట్టం తన పని చేస్తుంది.. కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి అని అన్నారు. చట్టపరమైన హక్కుల ప్రకారం ముందస్తు బెయిల్ తీసుకోవడం పారిపోవడం కాదన్నారు. ముందు బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతి అంశంపై విచారణలు ప్రారంభమయ్యాక కోర్టులను ఆశ్రయించిన వారు ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2014లో మహిళలపై నమోదైన కేసులు 14,147 ఉండగా 2023 నాటికి అవి 23,679కి చేరాయని, అంటే మహిళలపై నేరాలు సుమారు 67 శాతం పెరిగాయని, దీనికి బీఆరఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. 2022లో జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం, 2019లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత (30)పై సామూహిక అత్యాచారం జరిగింది.. ఈ ఘటనలపై మీ నైతిక బాధ్యత ఎక్కడికి పోయింది అని ప్రశ్నిస్తున్నానన్నారు. వేధింపులను తట్టుకోలేక 2023లో వరంగల్‌లో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి మీ ప్రభుత్వం బాధ్యత వహించదా? ముఖ్యమంత్రి బాధ్యత వహించరా? అదేవిధంగా మీ పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.. సూర్యాపేట జిల్లాకు చెందిన లంబాడ యువతి లక్ష్మి పోలీసుల వేధింపుల వల్లే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కస్టడీలో మృతిచెందిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కేటీఆర్.. మీ పాలనలో టీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, నాయకులు కూడా పలు అత్యాచార, మహిళా వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ నాయకులతో సంబంధాలున్న వ్యక్తులు యువతులకు డ్రగ్స్ ఇచ్చి కిడ్నాప్ చేసిన కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారని రామచందర్‌రావు తెలిపారు. నిర్మల్‌లో మైనర్ పై అత్యాచారం కేసులో కూడా టీఆర్ఎస్ నాయకుల పేర్లు వినిపించాయి. మహిళల హక్కులు, మైనర్ల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది.. ఆ సమయంలో కేసీఆర్ రాజీనామా చేశారా.. కేటీఆర్ బాధ్యత తీసుకున్నారా.. ఎవరైనా నైతిక బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు. కేటీఆర్ కుటుంబీకులపై లిక్కర్ స్కామ్ ఆరోపణల సమయంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం రాజీనామాలు చేయలేదు. కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేస్ వంటి అంశాల్లో ఇరుక్కుపోతామనే భయంతో కేటీఆర్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాని రామచందర్‌రావు విమర్శించారు. సమావేశంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *