రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్29: ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనములో వెల్నెస్ సెంటర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో నెలకొన్న అశాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానమని, అందుకు మానసిక పరివర్తన చెందాలని మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక మార్గం, పరిష్కారమన్నారు. ధ్యానం పై దృష్టి పెట్టి నిర్మించిన కన్హ శాంతి వనం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరమని తెలిపారు. ఏ సమస్యలు ఉన్న వారైనా కన్హ శాంతి వనంలో ధ్యానం చేసుకునేందుకు కావలసిన అన్ని రకాల వసతులు ఉన్నాయని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ గారి కోరిక మేరకు శాంతి వనాన్ని సందర్శించానని తెలిపారు.
ధ్యానం కోసం ఎంతో ఖర్చు చేసి సుధీర్ఘ ప్రాంతాలకు వెళ్తారని, తక్కువ ఖర్చుతో ఇక్కడే ధ్యానం చేసుకునేందుకు శాంతి వనంలో ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. కులం, మతం ప్రాంతంతో తేడా లేకుండా, నిరుపేదలు కూడా ఉచితంగా ధ్యానం చేసుకునేందుకు ఒక డార్మెటరీ నిర్మించడం అభినందనీయమన్నారు. వ్యవసాయాన్ని శాస్త్రీయంగా ఎలా నిర్వహించాలనే విషయం పై శిక్షణ ఇస్తున్నారని, అనేక రకాల మెడిసినల్ ప్లాంట్లను ఇక్కడ సాగు చేస్తున్నారని తెలిపారు. వాతావరణాన్ని నియంత్రిస్తూ ఏ పంట అయినా ఎలా పండించాలో ఇక్కడ అనుభవంలో తెలుసుకోవచ్చని సూచించారు.
యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ స్టేడియంను నిర్మించారు, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా పని చేసే వారిని ప్రోత్సహించడం బాధ్యతగా భావించి శాంతి వనాన్ని సందర్శించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, హెల్త్ సెంటర్ గ్లోబల్ గైడ్ దేవర్డ్ దార్జి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.