‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ
ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి
విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ!
విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భేటీ అవుదామనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి ముందుంచారు ఏపీ సీఎం.. దానికి అంగీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి.. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది.. షెడ్యూల్‌ 9,10 ‌పరిధిలోని సంస్థల విభజన..ఆస్తుల పంపకాల వంటివి ఇంకా తేలాల్సి ఉంది. ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన వ్యవహరంగా ఉంది. అలాగే ట్రాన్సుకో, ఉన్నత విద్యా మండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్‌ ‌బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్‌ ‌బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ ‌పెట్టనున్నట్టు సమాచారం..

 

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వొచ్చినా.. ఏపీకి కాస్తో కూస్తో ఆర్థిక ఊరట ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల భావనగా ఉందనేది సమాచారం. ఇక రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు.. డిస్కంలు, ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల గొడవ వంటివి కూడా సీఎంల భేటీలో ప్రస్తావనకు తెచ్చేలా  ప్రభుత్వాలు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు, ఇప్పటికీ కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ అనే రీతిలో పని చేస్తున్నారు. ఏపీకి అలాట్‌ ‌చేసిన వారు కూడా తెలంగాణలో పని చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్‌ ‌చేయాలని తెలంగాణ ఉద్యోగుల కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్‌ ‌సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్‌ ఉద్యోగులను కూడా రిలీవ్‌ ‌చేయాలని కోరుతోన్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు.

 

విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. ఈ విషయం మీద సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యం.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతి అంశంలోనూ గొడవలు పడుతూ ఉంటే.. కేంద్రం జోక్యం అనివార్యమవుతుంది. దీంతో పరిస్థితి మరింత జఠిలం కావడం తప్ప.. సమస్య సులువుగా పరిష్కారం కాదనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. దీంతో ముందుగా ఈజీగా సాల్వ్ అయ్యే పరిష్కారాలేంటో చూసుకుని.. వీలైనంత త్వరగా మెజార్టీ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు తెలుగు రాష్రాల సిఎంల భావన. అయితే, ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు.. ఇంకా ఎవరెవరు పాల్గొంటారు.. అజెండా ఏంటి అనేదానిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page