పసి హృదయాలకు సంజీవని

– మానవతకు చిరునామాగా శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్‌కేర్ సెంటర్
– 20 నెలల్లో 500 ఉచిత గుండె శస్త్రచికిత్సలు
– 14 దేశాల చిన్నారులకు జీవనభరోసా
– 233 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతం
– పుట్టుకతో వచ్చే గుండె లోపాలకే ప్రత్యేక చికిత్స
– అత్యాధునిక పరికరాలతో వైద్యం, వంద పడకల సామర్థ్యం
– దేశ నలుమూలల నుంచి కొండపాకకు వస్తున్న  రోగులు
– సత్యసాయి ట్రస్ట్ సేవలకు దేశవ్యాప్త గుర్తింపు
– సత్యసాయి సంజీవని హాస్పిట‌ల్‌ సేవలపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి సజీవ రూపం సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్‌కేర్ సెంటర్. పుట్టుకతోనే గుండె లోపంతో ప్రాణాలతో పోరాడుతున్న పసికందులకు కొత్త జీవితం అందిస్తూ కన్నీటిలో ఉన్న వేలాది కుటుంబాలకు చిరునవ్వులు పంచుతున్న అరుదైన సేవా సంస్థ ఇది. ఆర్థిక స్థోమత లేక ప్రైవేట్ ఆసుపత్రుల గడప తొక్కలేని నిరుపేద కుటుంబాలకు, లక్షల విలువైన అత్యాధునిక గుండె వైద్యాన్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందిస్తూ నిజమైన మానవత్వానికి నిర్వచనంగా నిలుస్తోంది. కులం, మతం, ప్రాంతం, భాష, దేశం అనే భేదాలకు అతీతంగా ప్రతి చిన్నారిని తమ సొంత బిడ్డగా భావించి ప్రాణాలు కాపాడుతున్న ఈ సేవా యజ్ఞం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 

సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహోన్నత సేవ కేవలం ఒక ఆసుపత్రి సేవ మాత్రమే కాదు నిరాశలో ఉన్న కుటుంబాలకు ఆశను, కన్నీటిలో ఉన్న తల్లిదండ్రులకు ధైర్యాన్ని, మరణ అంచులపై ఉన్న పసి ప్రాణాలకు పునర్జన్మను అందిస్తున్న మానవతా ఉద్యమం. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్, హర్యానాలోని పల్వాల్, మహారాష్ట్రలోని నవీ ముంబై, తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక కేంద్రాల ద్వారా దేశం నలుమూలల నుంచి వచ్చే చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందిస్తోంది. భారత్‌తో పాటు విదేశాల నుంచి కూడా చిన్నారులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందడం ఈ సేవా సంస్థకు లభిస్తున్న విశ్వాసానికి నిదర్శనం. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఏర్పాటు చేసిన ఈ హృదయాలయం నేడు తెలంగాణకే కాదు దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచస్థాయి నిపుణులైన వైద్యులు, నిస్వార్థ సేవాభావంతో పనిచేస్తున్న సిబ్బంది, పూర్తిగా ఉచిత వైద్య సేవలు… ఇవన్నీ కలిసి ఈ ఆసుపత్రిని “పసి హృదయాల దేవాలయం”గా నిలబెట్టాయి. పుట్టుకతో గుండె లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు కొండంత భరోసాగా నిలుస్తోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్.

ఏడాదికి 3.5 లక్షల చిన్నారులకు గుండె లోపం 

దేశంలో ప్రతి ఏడాది సుమారు 3.5 లక్షల మంది చిన్నారులు పుట్టుకతోనే గుండె సంబంధిత లోపాలతో జన్మిస్తుండగా, సరైన చికిత్స అందక దాదాపు లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండపాకలో ఏర్పాటైన ఈ హార్ట్‌ కేర్ సెంటర్ అనేక కుటుంబాలకు కొత్త జీవితాన్ని అందిస్తోంది. ప్రారంభమైన కొద్దికాలంలోనే ఆసుపత్రి విశేష సేవలందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభమైన 20 నెలల్లో 500 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. అంతకుముందు భారత్‌తో పాటు 14 దేశాలకు చెందిన 336 మంది చిన్నారులకు ప్రాణదాతగా నిలిచి, 233 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతంగా పూర్తి చేసింది. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సేవాభావంతో కూడిన వైద్య బృందం ఈ విజయానికి కారణమయ్యాయి.

పూర్తిగా ఉచితం

ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే..? పుట్టుకతో వచ్చే గుండె లోపాలు ఉన్న చిన్నారులకు పరీక్షల నుంచి శస్త్రచికిత్స, మందులు, ఐసీయూ సేవలు వరకు అన్నీ పూర్తిగా ఉచితం. అంతేకాదు, చిన్నారితో పాటు వచ్చిన ఇద్దరు కుటుంబ సభ్యులకు ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తున్నారు. గ్రామాలు, గిరిజన తండాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి గుండె సమస్యలున్న చిన్నారులను గుర్తించి ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించడం ఈ సంస్థ సేవా తపనకు నిదర్శనం.అత్యాధునిక వైద్య సదుపాయాలు, 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, బాలల గుండె చికిత్సలో నిష్ణాతులైన వైద్యులు, 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. గుండెకు రంధ్రం, వాల్వ్ లోపాలు, రక్తప్రసరణ సమస్యలు, గుండె నిర్మాణ లోపాలు తదితర వందకు పైగా రకాల పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.

దేశ విదేశాల నుంచి కొండపాకకు 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా తదితర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా చిన్నారులు కొండపాకకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పిన కేసులు ఇక్కడ పూర్తిగా ఉచితంగా విజయవంతంగా చికిత్స పొందుతున్నాయి. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రతిష్ఠాత్మక ఆసుపత్రి సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందిస్తున్న సేవలను అభినందించారు.

తన్నీరు హరీశ్‌రావు సహకారం 

2022 సంవత్సరంలో కొండపాక మండల కేంద్రంలో ఈ ప్రతిష్ఠాత్మక సేవా సంస్థ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందించారు అప్పటి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు. ఆయన ప్రత్యేక చొరవ చూపడంతోనే నేడు ఇంత పెద్ద స్థాయిలో ఆసుపత్రి వచ్చిందని , చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని  ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.  స్థానిక ప్రజలు  ఈ సేవా సంస్థ జిల్లాకు రావడానికి హరీష్ రావు చేసిన కృషిని  గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల ఈ దవాఖాన 500 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి పాల్గొన్న  మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ఏడాది వేతనాన్ని ఆసుపత్రికి విరాళంగా అందజేస్తూ చేసిన ప్రకటనతో మరో మారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

సిర్ఫ్ దిల్.. బినా బిల్

పుట్టుకతో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు చికిత్సను వాయిదా వేయకుండా సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ దవాఖాన అందిస్తున్న ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం  80101 19000 , 70751 37733 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.  సిర్ఫ్ దిల్ బినా బిల్ అనే నినాదంతో పసి హృదయాలకు పునర్జన్మను ప్రసాదించడమే లక్ష్యంగా, బోసినవ్వులను మొగ్గలోనే రాలిపోకుండా కాపాడేందుకు  సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అందిస్తున్న సేవలు నిరంతరం కొనసాగేందుకు సత్యసాయి ట్రస్ట్ నిరంతరం కొనసాగాలని కోరుకుందాం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *