– దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి
– జనాభా ప్రాతిపదికన కాక దూరాన్నిబట్టి అభివృద్ధి
– కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన కాక ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా దూరాన్నిబట్టి హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తామని, అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలను మంజూరు చేస్తామని చెప్పారు. అవసరాన్నిబట్టి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ రెండున్నరేళ్లల్లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు. జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని, హాస్పిటళ్లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొత్తగూడెం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంత్రిని కోరారు. ఎంసీహెచ్, జీజీహెచ్ నడుమ దూరం ఎక్కువగా ఉన్నందున ఎంసీహెచ్‌కు ఒక ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను నియమించాలని, కొందరు డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, కొత్తగా నాలుగు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటల్స్‌కు అనుబంధంగా అంబులెన్స్‌లను మంజూరు చేయాలని, జిల్లాల్లోని ఏరియా హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీలలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వాటిని అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీచింగ్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్‌సీల్లో ప్రభుత్వం ఇటీవలే జనరేటర్లు ఏర్పాటు చేసిందని, తమది అటవీ ప్రాంతం అయినందున వర్షాల సమయంలో పవర్ కట్ సమస్య ఉంటుందని, అందువల్ల పీహెచ్‌సీల్లోనూ జనరేటర్లT ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. వీటిపై మంత్రి స్పందిస్తూ అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదన్నారు. ఈ క్రమంలోనే గత నెలలోనే ఐటీడీఏ పీవోలతో సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ మంజూరు చేశామన్నారు. సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్‌కు అనుబంధంగా అంబులెన్స్‌లను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడు డయాలసిస్ సెంటర్లు ఉండగా మరో నాలుగు సెంటర్లు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 20 నిమిషాల ప్రయాణంతో పేషెంట్ డయాలసిస్ సెంటర్‌కు చేరుకునేలా డయాలసిస్ నెట్‌వర్క్‌ను విస్తరించామన్నారు. భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లెందు సహా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తగూడెం సహా అటవీ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొమురారం హాస్పిటల్ అప్‌గ్రేడ్‌తోపాటు ఇల్ల్లెందు హాస్పిటల్‌లో కొత్త ఐసీయూను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిలో ఎవరికైనా భద్రాచలం, అశ్వారావుపేట వంటి అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉంటే వారికి ఆయా హాస్పిటల్స్‌లో పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి సూచించారు. అదే సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కొత్తగూడెం ఎంసీహెచ్‌లో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌ను పర్యవేక్షించేందుకు ఒక డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్‌లో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ మానిటరింగ్ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యేలకు మంత్రి వివరించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. వర్షాలు, వరదల వల్ల రోడ్డు కనెక్టెవిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రసవం తేదీ దగ్గర పడిన గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ హాల్స్‌కు తరలించాలని, అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం, ఇల్లందు, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనుకయ్య, జారె ఆదినారాయణ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎసఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





