సిఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి
మంత్రి కోయటి రెడ్డి, హరీష్ రావు, తదితరుల నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : తెలంగాణ మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఆయన కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చేరిన జిట్టా చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. భువనగిరిలోని మగ్గంపల్లి రోడ్డులో ఆయనకి ఉన్న ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ఉన్న జిట్టా బాలకృష్ణ…ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌తో కలిసి చాలా పోరాటాలు చేశారు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతకు చెప్పడంలో విజయవంతమయ్యారు. కాగా తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తన ప్రాంత ప్రజల కోసం ఎంతో తపనపడ్డారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జిట్టా మరణం పట్ల సంతాపం తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. హరీష్ రావు వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉన్నారు. ఇదిలావుంటే జిట్టా బాలకృష్ణా రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలు, జిట్టా అభిమానులు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు.