నాది ముమ్మాటికీ బీజేపీ డీఎన్‌ఏనే..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్‌ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్‌ఏ భారతీయ జనతా పార్టీ అని చెప్పారు.
మిగిలిన వారి మాదిరి 10 పార్టీలు మారిన డీఎన్‌ఏ తనది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపడుతోందని… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్మాణాత్మక పాలనపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.