నిధుల కొరత ఉన్నా అభివృద్ధికి వెనుకాడం
కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే టీడీఆర్‌పై ఆరోపణలు
ఉప్పల్‌లో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు చేస్తున్నట్టు చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిందేనన్నారు. ఆయన సమయంలో చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీఆర్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఆరోపించారు.
ఉప్పల్, రామంతాపూర్ డివిజన్లలో రూ. 42 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బండారు శ్రీవాణి, స్వర్ణరాజ్ శివమణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పల్ వార్డు కార్యాలయంలో ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
ఉప్పల్ తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేశామన్నారు. నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైన అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు పట్టించుకోని కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి, వాతావరణానికి తోడు అభివృద్ధి వేగవంతం చేసేందుకే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజలకు విద్య, వైద్యం, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలకు దీటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యువత అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి జంట నగరాల దాహార్తి తీరుస్తామన్నారు. టిడిఆర్ కార్యక్రమం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. టిడిఆర్ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కానీ కేటీఆర్ వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. నిధుల కొరత వెంటాడుతున్నా, నిధులు లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైనసూచనలు, సహకారాన్ని తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు. అయినా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ఎలాంటి వివక్ష చూపకుండా.. ఉప్పల్ ప్రజల కోసం అభివృద్ధి పనులకు కావాల్సినన్ని నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో మన ఉప్పల్, రామంతపూర్ డివిజన్లలో ఒకే రోజు దాదాపు రూ.50 కోట్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్ సర్కిల్ లోని మూడు డివిజన్లల్లో ఏళ్ల తబరడి ట్రంక్ లైన సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరి కృషితో రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సూపర్ సక్కర్ అనే యంత్రంతో ట్రంక్ లైన్ క్లీనింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. ఉప్పల్ వాసుల కోరిక మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఉప్పల్ భాగాయత్ లో మొదలు పెట్టాలని మంత్రిని కోరారు.