రైతు చెంతకు సాంకేతికత చేరవేయడమే లక్ష్యం

– ఘనంగా రైతునేస్తం 100వ ఎపిసోడ్
– ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలక పాత్ర
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. 1600 రైతు వేదికల ద్వారా లక్షలాదిమంది రైతులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి త్ముల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతు వేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. 2024 మార్చి 6న ప్రారంభమైన రైతునేస్తం కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం రైతుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రెండేళ్లలో 2,43,830 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా మొత్తం 27.30 లక్షలకు పైగా రైతులు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. రైతు వేదికలను డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి రైతులతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలను కలిపిన కార్యక్రమం దేశంలోనే ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకవైపు ఎల్-నినో ప్రభావం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని మంత్రి ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం, రైతులు కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో నీటి లభ్యత మరింత సవాలుగా మారే అవకాశాలు ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు పరిశీలించాలని సూచించారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమం 100వ ఎపిసోడ్ విజయవంతంగా పూర్తవడానికి సహకరించిన రైతులకు, శాస్త్రవేత్తలకు, అధికారులకు అభినందనలు తెలిపారు. రైతులు నేరుగా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పొందేందుకు ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, పలువురు ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రైతు రామకృష్ణ మాట్లాడుతూ తక్కువ నీరు, తక్కువ ఎరువులతో అధిక ఆదాయం సాధించే శాస్త్రీయ పద్ధతులను రైతు నేస్తం ద్వారా నేర్చుకుంటున్నామని తెలిపారు. తాను రైతు నేస్తం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదని జగిత్యాల జిల్లా పూడూరుకు చెందిన రాంరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డి మాట్లాడుతూ ఇరవయ్యేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని, రైతు నేస్తం ద్వారా లభిస్తున్న శాస్త్రీయ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతు లావణ్య మాట్లాడుతూ వర్షాధార పంటలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, కందులు, పెసలతో పాటు ఆవాలు, ధనియాలు వంటి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సీహెచ్ రామారావు మాట్లాడుతూ ఒకప్పుడు ప్రైవేట్ కండక్టర్‌గా పనిచేసిన తాను తక్కువ నీటితో బోడ కాకర సాగు ప్రారంభించి ప్రస్తుతం 20 ఎకరాలకు విస్తరించానని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు వల్లూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించానని, ప్రస్తుతం మంచి దిగుబడి, ఆదాయం వస్తోందని చెప్పారు. అడవి జంతువుల బెడద లేకుండా అన్ని పరిస్థితులను తట్టుకునే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల విచ్చలవిడి యూరియా వాడకం గణనీయంగా తగ్గిందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమం ఎంతో గొప్పదని, భూపాలపల్లి ప్రాంతంలోని రిమోట్ ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తల విలువైన సూచనలు చేరుకోగలుగుతున్నాయని ప్రశంసించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తాను కూడా తన ఐదెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని, మరో ఏడు ఎకరాలకు విస్తరిస్తానని తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ 2022లో ఐదు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించి ప్రస్తుతం 29 టన్నుల 210 కిలోల గెలల దిగుబడితో రూ.6.53 లక్షల ఆదాయం పొందానని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ రూ.2.84 లక్షలు లభించాయని, నాలుగేళ్లు పూర్తికాకముందే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోందని చెప్పారు. అనంతరం మంత్రి తుమ్మల వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. అలాగే ప్రతి జిల్లాకు అయిదుగురు ఆదర్శ రైతులను కూడా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, డైరెక్టర్ బి.గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాల యాల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *