దక్షిణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 28 : దక్షిణ తెలంగాణలో రోజురోజుకూ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం బలపడుతుండటం భవిష్యత్ రాజకీయాలకు శుభపరిణామం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన జనసంఘ్ నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలను సన్మానించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, దశాబ్దాలుగా పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన కార్యకర్తలను కలవడం గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు. పదేళ్లపాటు తెలంగాణను దోచుకున్న బీఆరఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం నుంచి తప్పించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీఎస్‌పీఎస్సీ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలతో యువత నష్టపోయింది. ఇప్పుడు టీజీపీఎస్సీ నిర్వహణపైనా తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత గోప్యంగా భద్రపరచాల్సిన పరీక్షల ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాలు వేల సంఖ్యలో హైదరాబాద్ రోడ్డుపై కనిపించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇంతటి నిర్లక్ష్యం ఎలా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.లి కేవలం ఎఫఐఆర్ నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. టీజీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. పరీక్షలను పారదర్శకంగా, సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ అమలు కాలేదు. టీజీపీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలను సకాలంలో నిర్వహించి, పేపర్ లీకేజీలు, జాప్యాలు, న్యాయ వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఫలితాలు ప్రకటించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల అనంతరం అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించినప్పటికీ, న్యాయ ప్రక్రియ ఆలస్యం కావడంతో వారు తీవ్రంగా నష్టపోయారంటూ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బీఆరఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని సమర్థవంతంగా నిర్వహించలేకపోయాయన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడమే సీఎం రేవంత్ తొలి బాధ్యత కావాలంటూ దిల్లీ వెళ్లి అధిష్ఠానం నాయకులను కలవడం కంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని హితవు పలికారు. విద్యార్థుల ఆకాంక్షలను గౌరవిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారన్నారు. కేరళలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా అక్కడి కాంగ్రెస్ నేతలు స్పందించడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలపై విమర్శలు చేసే ముందు విద్యార్థులపై లాఠీచార్జిలు జరుగుతున్న పరిస్థితులను కాంగ్రెస్ నాయకులు సమీక్షించాలన్నారు.

కాంగ్రెస్-ఎంఐఎం ఓటు బ్యాంకు కుట్రలను ఉపేక్షించం

రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియపై మాట్లాతూ కాంగ్రెస్-ఎంఐఎం కూటమి నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమ అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఎంఐఎం డిమాండ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శించారు. ఆధారాలు లేని వ్యక్తులకు హడావుడిగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టికెట్లు జారీ చేసి వాటిని ‘సర్‌’ కోసం ఆమోదయోగ్యమైన పత్రాలుగా చూపించడం వెనుక అక్రమ చొరబాటుదారులను రక్షించే కుట్ర దాగి ఉందన్నారు. ఓటర్ల జాబితాను నిర్వీర్యం చేసే ఏ ప్రయత్నాన్నైనా బీజేపీ తీవ్రంగా నిరసిస్తుందని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండి ఎలాంటి అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా చూడాలని ఆదేశించారు.

రాష్ట్రమంతటా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది

తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదేనని, మాజీ అధికారి సుధాకర్ రెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని రామచందర్ రావు అన్నారు. అపారమైన అనుభవం, దేశ సేవ చేయాలనే నిజాయతీ కలిగిన అధికారులు, విద్యావంతులు బీజేపీని సరైన వేదికగా భావించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీరి చేరికతో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ఖచ్చితంగా పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

‘ఆటా’ వేడుకలకు ఆహ్వానం

అమెరికాలోని మేరీల్యాండ్ వేదికగా జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్‌కు రామచందర్ రావుకి ఆహ్వానం అందింది. ఈనెల 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న సమ్మేళనానికి ఆయనను విశిష్ట అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆటా ఆహ్వానించింది. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఆగస్టు 6న హైదరాబాద్‌కు చేరుకుంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *