– రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి
– బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ రద్దు చేయాలి
– సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం ఆగస్టు 7న నిర్వహించనున్న అఖిల భారత ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మహాసభకు సంబంధించిన గోడపత్రికను ఎర్రమంజిల్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులపై అమలవుతున్న క్రిమిలేయర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం బీసీలకు కల్పించిన రిజర్వేషన్ హక్కులు క్రమంగా నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో బీసీలకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్, ఇంజినీరింగ్, ఐఐటీ తదితర ఉన్నత విద్యా సంస్థల్లో దక్కాల్సిన సీట్లు ఇతర వర్గాలకు మళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితిని బీసీ సమాజం తీవ్రంగా పరిగణించాలని, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత పోరాటమే మార్గమని స్పష్టం చేశారు. బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ హక్కుల సాధనకు అఖిల భారత ఓబీసీ మహాసభ ఒక చరిత్రాత్మక వేదికగా నిలవబోతోందన్నారు. అందువల్ల తెలంగాణ నలుమూలల నుంచి బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేయడం సామాజిక న్యాయానికి అనివార్యమని అన్నారు. కార్యక్రమంలో సంఘం అడ్వైజర్ సుంకరి శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీకాంత్, అసోసియేట్ ప్రెసిడెంట్ వారాల శ్రీనివాస్, రామరాజు, వైస్ ప్రెసిడెంట్ రాసూరి జ్ఞానేశ్వర్, జగన్, మహేంద్ర సాగర్, షమీమ్ సుల్తానా, మహిళా ఉద్యోగుల సంఘం కార్యదర్శి జ్యోతి శీలం, మంజులత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





