ఆధిపత్యపు ‛చేయి’ కింద నలుగుతున్న ఎస్సీ ఎమ్మెల్యేలు

– సీటు ఉన్నా దక్కని ఆత్మగౌరవం
– వాళ్ల ప్రాతినిధ్య నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో చిన్నచూపు
– కాంగ్రెస్ లో రగులుతున్న కులవివక్ష మంటలు
– కవ్వంపల్లి అసంతృప్తి వ్యాఖ్యల దావానలం

                                                                                (ప్రజాతంత్ర న్యూస్‌ నెట్ వర్క్ ,హైదరాబాద్)

కాంగ్రెస్‌లో లౌకికత్వం, సామాజిక సమతుల్యత మటుమాయమైపోతున్నాయా? దళితులకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందన్న నమ్మకం ఆవిరవుతున్నదా? అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానాన్నే ఇస్తున్నాయి. జాతీయ స్థాయిలో లౌకిక విధానాలు, సామాజిక న్యాయం, కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ వంటి మార్గదర్శకాలతో ముందుకెళ్తున్నామనే ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిపాలనా విధానాలకు నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒకప్పుడు అన్ని వర్గాలను కలుపుకొని పోయే విశాల వేదికగా నిలిచిన కాంగ్రెస్.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల తరహాలోనే కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాల ఆధిపత్యంలోకి జారిపోయిందనే అసంతృప్తి బలపడుతున్నది. రెడ్డి, వెల‌మ‌, కమ్మ, ఇతర ప్రభావిత బీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో గెలిచిన దళిత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ‘మాదిగ’ వర్గానికి చెందిన నేతలు స్వయంప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు ఉన్నా నిర్ణయాధికారాల్లో పక్కనబెట్టడం, ప్రాధాన్యత కలిగిన నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపడం, ప్రొటోకాల్‌ ఉల్లంఘనల పేరిట అవమానాలకు గురిచేయడం వంటి వరుస సంఘటనలు పార్టీ అంతర్గత కుల సమీకరణాల్లోని ఆధిపత్య ధోరణికి అద్దం పడుతున్నాయి. సీటు ఉన్నా దక్కని ఆత్మగౌరవం, సొంత ప్రభుత్వంలోనే ఎదురవుతున్న ఈ ఆధిపత్య నీడలపై ఎస్సీ ఎమ్మెల్యేలు రగిలిపోతూ గళమెత్తడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర తుఫాను రేపుతున్నది.
తెలంగాణలో సామాజిక న్యాయం, ఇందిరమ్మ రాజ్యం నినాదాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవ పోరాటం రాజకీయంగా తీవ్ర  చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సొంత ప్రభుత్వంలోనే తీవ్ర వివక్షకు, ఆధిపత్య ధోరణులకు గురవుతున్నారనే వాస్తవం వరుస సంఘటనల ద్వారా బహిర్గతమవుతున్నది. మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగంగా చేసిన విమర్శలు కేవలం ఒక వ్యక్తిగత అసంతృప్తి కాదని, అది అధికార యంత్రాంగం, పార్టీ ఆధిపత్య వర్గాల పట్ల దళిత శాసనసభ్యుల్లో రగులుతున్న లోతైన ఆవేదనకు ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ నియోజకవర్గాల పట్ల నిర్లక్ష్య వైఖరిపై కవ్వంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మందుల సామేల్‌కే కాక దళిత ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం, పార్టీలోని అగ్రకుల నేతల నుంచి ఇదే తరహా వివక్ష ఎదురవుతున్నదని ఆయన స్పష్టం చేయడం ద్వారా సమస్య తీవ్రతను, దాని విస్తృతిని ఎత్తిచూపారు. ఎస్సీ నియోజకవర్గాలు, అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు నిరంతరం అణచివేతకు గురవుతున్నారని, ఇకపై ఈ అన్యాయాన్ని మౌనంగా భరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ అంతర్గత అసంతృప్తి నేపథ్యానికి మూలం కేవలం రాజకీయం మాత్రమే కాదు. నిధుల వికేంద్రీకరణ, పరిపాలనా ప్రాధాన్యతలలో లోతుగా వేళ్లూనుకున్న ప్రాంతీయ, కులగత అసమానతలు. దళిత ఎమ్మెల్యేలు కేవలం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడానికే పరిమితం కాకు తమ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు అదనపు నిధులు, ప్రాజెక్టులలో ప్రాధాన్యాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి ఎస్సీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఎస్సీ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ప్రతిపాదనలు సమర్పించారు.

ఎస్సీ లీడర్లపై ఆధిపత్య రాజకీయాల పంజా

సొంత పార్టీలోని అగ్రకుల నేతలు, మంత్రుల ఆధిపత్య వైఖరి వల్ల ఎస్సీ ఎమ్మెల్యేలు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్,  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య నడుస్తున్న వివాదం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, స్థానిక మార్కెట్ కమిటీలు, మార్కెటింగ్ పదవుల ఎంపికలో స్థానిక దళిత ఎమ్మెల్యే అభిప్రాయాలను పక్కనబెట్టి అగ్రకుల నేతలు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించారని, ప్రొటోకాల్ పాటించకుండా సభలు నిర్వహించారని మందుల సామేల్ బహిరంగంగా నిరసన తెలిపారు. మాదిగ నియోజకవర్గాలపై ఎగువ కులాల పెత్తనం ఏంటని, మాదిగలు ఎవరికీ బానిసలు కాదని సామేల్ స్పందించడం కాంగ్రెస్ అంతర్గత కుల సమీకరణాల్లో ఉన్న ఉద్రిక్తతను ఎత్తిచూపింది. ఈ ఆధిపత్య వైఖరి కేవలం నియోజకవర్గ స్థాయికే పరిమితం కాకుండా, అధికారికంగా రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణానికి కూడా వ్యాపించిందనడానికి ఆధారాలు లభించాయి. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే దళిత ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న అవమానకర సంఘటనలు ఈ ఆధిపత్య ధోరణికి స్పష్టమైన సాక్ష్యంగా నిలిచాయి. ఉదయం వేళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలవడానికి వెళ్లిన తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్, మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణలను భద్రతా సిబ్బంది ఛాంబర్ లోపలికి అనుమతించకుండా గంటల తరబడి నిరోధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు భట్టిని కలవకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం శాసనమండలి భవనంలో జరిగే సమావేశానికి వెళ్తున్న దళిత వర్గానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలను భద్రతా సిబ్బంది ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూట్’ అనే కారణంతో అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకే అసెంబ్లీ పరిసరాల్లో సంచరించే హక్కు లేదనడంపై డాక్టర్ దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి బారికేడ్లను దాటుకొని వెళ్లడం, అధికార యంత్రాంగంలో ఉన్న వివక్షాపూరిత మనస్తత్వాన్ని బయటపెట్టింది.

చల్లారని పొన్నం వర్సెస్ అడ్లూరి వివాదం

శాసనసభ్యుల స్థాయిలోనే కాక మంత్రివర్గంలోనూ కుల వివక్షా పూరిత వ్యాఖ్యలు కలకలం రేగడం పాలకపక్షాన్ని ఇరకాటంలో పడేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌నగర్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలస్యంగా వచ్చిన సందర్భంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమయపాలన లేని దున్నపోతు ఆలస్యంగా వచ్చింది అన్న తరహా ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారనే వివాదం భగ్గుమన్నది. మంత్రి అడ్లూరి ఈ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక దళిత(మాదిగ) సమాజానికి చెందిన వ్యక్తి మంత్రి కావడం సహించలేకే ఇలాంటి నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాదిగ కులంలో పుట్టడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించడమే కాక కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి సైతం తన పట్ల వివక్ష చూపుతున్నారని, తాను కూర్చునేందుకు వస్తే లేచి వెళ్లిపోతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధిష్ఠానంకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకొని గాంధీ భవన్‌లో ఇరు నేతల మధ్య రాజీ కుదిర్చారు. పొన్నం ప్రభాకర్ బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ పార్టీ అంతర్గత నిర్మాణంలో దళిత నాయకత్వం ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక ఒత్తిళ్లకు ఈ సంఘటన నిదర్శనంగా మిగిలింది. ఇదిలా ఉంటే సదరు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో మాదిగలపై తీవ్ర వివక్ష చూపుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్న ఆ వర్గాల దూరంగా పెడుతూ తీవ్రంగా అవమానించడమేకాక ప్రజల్లో పార్టీని కూడా పలుచన చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

మంత్రుల నియోజకవర్గాలకే నిధుల్లో సింహభాగమా?

అధికార పార్టీలో ఉన్న సాధారణ దళిత ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ నిధుల వికేంద్రీకరణ, అభివృద్ధి సంక్షేమ ఫలాల పంపిణీకి సంబంధించినది. రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు, ముఖ్యంగా సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలకు వేల కోట్ల రూపాయల బడ్జెట్ గ్రాంట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్ డీఎఫ్) వేగంగా మంజూరవుతుంటే, ఎస్సీ నియోజకవర్గాల బిల్లులు నెలల తరబడి ఆర్థిక శాఖ వద్ద నిలిచిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి సాధారణంగా 3,500 ఇండ్లను మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లకు రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎస్సీ నియోజకవర్గాల్లో పేదరికం, ఇండ్లు లేని దళిత కుటుంబాల సంఖ్య ప్రామాణికంగా అత్యధికంగా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి సాధారణ కోటాతో పాటు ఎస్సీ నియోజకవర్గాలకు అదనంగా మరో 1,000 ఇండ్లను కేటాయించాలని, ఎస్సీ కేటగిరీ కింద మంజూరయ్యే నిధులలో ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రాధాన్యాలకు అనుగుణంగా బిల్లులు త్వరగా క్లియర్ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గళమెత్తారు. ఎమ్మెల్యే మందుల సామేల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్, ఎంపీ చామల కిరణ్ వివాదంలోనూ కులవివక్ష ఉందని విమర్శలు వచ్చాయి. పార్టీ నియామకాల్లో, అభివృద్ధి పనుల్లో స్థానిక ఎస్సీ ఎమ్మెల్యేను పక్కనబెట్టారని, దీనితో సదరు ఎమ్మెల్యే బాహాటంగానే తన అసంతృప్తిని వెల్లగక్కారంటున్నారు. ఈ వివాదంపై జగ్గారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏడుపేజీల నివేదిక సమర్పించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదంలో టీపీసీసీ జోక్యంతో పొన్నం ప్రభాకర్ భేషరతుగా క్షమాపణ చెప్పించి, కేబినెట్‌లో రాజీ కుదిర్చినా ప్రైవేట్ కార్యక్రమాల్లో ఇంకా అలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలే వినిపిస్తున్నాయని పార్టీలో ఎస్సీ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్, అసెంబ్లీ కౌన్సిల్ మార్గాల్లో ఎస్సీ, ఎస్టీ నేతలు, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్కను భద్రత పేరిట అడ్డుకున్న వివాదంలో సదరు నేతలు అసెంబ్లీ నిబంధనలపై నిరసన వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నిధుల మంజూరులో మంత్రుల నియోజకవర్గాలకే ప్రాధాన్యమిస్తూ, ఎస్సీ ప్రాంతాలకు నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. ఎస్సీ నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి కూడా చేశారు.

కాంగ్రెస్ సంప్రదాయ ఓటుపై ప్రభావం

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి కేవలం తాత్కాలిక రాజకీయ వివాదం కాదని, అది అధికార వ్యవస్థలో లోతుగా వేళ్లూనుకున్న ప్రాంతీయ, కులగత ఆధిపత్య ధోరణులపై వచ్చిన స్పష్టమైన ప్రతిస్పందనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి అసంతృప్తి, సామేల్ జరిపిన ప్రొటోకాల్ పోరాటం,  మంత్రి అడ్లూరి ఆత్మగౌరవ స్పందనలు కాంగ్రెస్ అధిష్ఠానం ముందు తీవ్రమైన సవాళ్లను నిలబెట్టాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు నిధుల విడుదల కోసం ప్రత్యేక ప్రాధాన్యతా విధానాన్ని అమలు చేయడం అత్యవసరంగా మారింది. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మ‌ళ్లించ‌కుండా చారిత్రక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకొని ఎస్సీ నియోజకవర్గాలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇతర మౌలిక సదుపాయాల గ్రాంట్లు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా, పార్టీ, ప్రభుత్వ పనుల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా నిరోధించడం, భద్రతా యంత్రాంగం ప్రజాప్రతినిధుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేలా నిబంధనలను సవరించడం పరిపాలనా శ్రేయస్సుకు ముఖ్యం. జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం, కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ ప్రధాన నినాదాలుగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, క్షేత్రస్థాయిలో సొంత దళిత ఎమ్మెల్యేలు నిధుల వివక్షపై గళమెత్తడం నైతిక, రాజకీయ పరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది. పాలకవర్గాలు ఈ అసంతృప్తిని త్వరితగతిన పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఇది కాంగ్రెస్ సంప్రదాయ దళిత ఓటుబ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *