నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు
స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 9(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
బిఆర్‌ఎస్, బిజెపి నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి హైకోర్టు విచారించగా..సుధీర్ఘ వాదనలు కొనసాగాయి.
ఈ విషయంలో సుప్రీమ్ కోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు..నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సుప్రీమ్ కోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను పిటిషనర్లు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. పిటిషన్‌న్ల విచారణకు స్వీకరించిన ధర్మాసనం..పలు దఫాలుగా వాదనలు విన్నది.
అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కలుగుతుంది.





