నేను బిహెచ్‌ఇఎల్ లో జాయిన్ కాకముందు హైదరాబాద్ చిక్కడ్ పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్ బోర్డ్ లో పనిచేసే వారు. ఒక సాయంత్రం ఆయనతో బాటు వారి ఆఫీసుకు (1971) లో పోయాను. అక్కడే చాలా కాలం తర్వాత పీ ఎన్ స్వామి గారిని కలవడం జరిగింది. వీరు మా నాన్న గారి సంపాదకత్వంలో 1948 నుండి 1958 వరకు వరంగల్ నుండి వెలువడిన ‘కాకతీయ పత్రిక’ లో జర్నలిస్ట్ గా పనిచేసారు. మా ఇంట్లో అందరికీ సుపరిచితుడు. చాలా సంతోషం కలిగింది. ఈ సమయం లోనే (1972 నుండి 1975 వరకు) ఇందుర్తి ప్రభాకర రావు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచరులో డాక్టరేట్ చేస్తూ ‘సురవరం ప్రతాపరెడ్డి ‘ గారి రచనల మీద పరిశోధన చేస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి భోజనం తర్వాత ఇద్దరం పిచ్చాపాటీగా మాట్లాడు కుంటున్న ప్పుడు సురవరం గారి గురించి ఏదో ఒక కొత్త విశేషం చెప్పే వారు.
ఇక విషయానికి వస్తే పాల్వంచలో కేటీపీఎస్ ఉద్యోగులు ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పరుచుకొని ప్రతి నెలా ఏదో ఒక సాం స్కృ తిక కార్యక్రమం నిర్వ హించే వారు. లేదా ఒక ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించి ఆయనతో ఏదైనా ముఖ్య విషయం పై ప్రసంగం ఏర్పరచే వారు. 1979 లో నేను ఆ సంస్థ కార్యదర్శి తో మాట్లాడి ఒక ఆదివారం ఇందుర్తి ప్రభాకరరావు గారి ప్రసంగం ఏర్పాటు చేసాను. కార్యక్రమం నాటి ఉదయం పొద్దున్నే 5 గంటలకు హైదరాబాదునుండి బస్సులో వచ్చిన ఆయనను రిసీవ్ చేసుకొని ప్రాజెక్ట్ హాస్టల్ లోని మా 10 వ రూం కి తీసుకొని పోయాను. ఉదయం 11 గంటలకు ఆయనను భద్రాచలం గుడికి తీసుకొనిపోయి దైవదర్శనం ఐన పిదప మళ్ళీ పాల్వంచ వచ్చాము. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఆరంభమైన సమావేశంలో ‘సురవరం ప్రతాప రెడ్డి గారి జీవన విశేషాలు ‘ అనే అంశం పై గంటన్నర సేపు అనర్ఘళంగా సాగిన ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
అప్పటి సూపరెంటింగ్ ఇంజినీర్ రామచంద్రా రెడ్డి గారు, డివిజనల్ ఇంజనీర్ సూర్యారావు గారు గొప్ప వక్తను పిలిపించారని నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం నాకు సంతోషం కలిగించింది.మరునాడు ఆయనను కిన్నెరసాని ప్రాజెక్టుకు తీసుకొ నిపో యి చూపించి మధ్యా హ్నం విశ్రాంతి తీసు కున్న తర్వాత రాత్రి భోజనం అయిన పిదప 10 గంటలకు హైదరాబాదు పోయే ఎక్స్ ప్రెస్ బస్సులో ఆయనను ఎక్కించి వీడ్కోలు చెప్పాను.ఇక నేనూ, మోహన్ ఇద్దరం దాదాపు ప్రతి ఆదివారం భద్రాచలం పోయే వాళ్ళం. మెట్లెక్కి దేవాలయం చేరి ఒక పది నిముషాల్లో దర్శనం ముగించుకొని బయటకు వచ్చి గుడి ముందు వున్న రావి చెట్టు క్రింద చుట్టూ ఏర్పరచిన గద్దె మీద ఒక అరగంటైనా కూర్చునే వాళ్ళం. గుడి బయట అప్పుడు ఆ చెట్టూ, ఆ గద్దె తప్ప ఏమీ వుండక పోయేది. ఆ అరగంట వ్యవధిలో పట్టు మని పదిమంది భక్తులు కూడా వచ్చే వారు కాదు. అంత ప్రశాంతత!…
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు