డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సైద్దాంతిక ఆలోచన ప్రకారం సామాజిక న్యాయం అనేది మానవులందరి స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం కోసం నిలుస్తుందని ఆ కోణంలో అణగారిన వర్గాల దుస్థితిని చూసి, తను అనుభవించిన వివక్షతలను ఆధారంగా చేసుకొని డాక్టర్ అంబేడ్కర్ తన వాగ్దాటిని పెంచి, అన్యాయం, అసమానతలు, వివక్ష తలకు గురైన అణగారిన వర్గాల పక్షాన ‘‘సామాజిక న్యాయం’’ కోసం తన ధ్యేయాన్ని ప్రారంభించిన విషయాన్ని కొన్నిశక్తులు గుర్తెర గాల్సిన అవసరం ఉన్నది. అన్యాయాన్ని ఎదిరిం చడమంటేనే రాజ్యాంగం నిర్థేశించిన న్యాయ మార్గంలో పయనించడమే.
బిసి వర్గీకరణే ఎస్సీ వర్గీకరణకు ప్రాతిపదిక
సామాజిక న్యాయ ప్రాతిపదికగా జనాభా దామాషా ప్రకారం లోతైన అధ్యయనం చేసి 1970 దశకంలోనే బిసిలలోని 112 కులాలను అనాటి ప్రభుత్వం ఏ,బి,సి,డి గా వర్గీకరణ చేశారు. బి.సిలు అనాటి నుంచి వారివారి రిజర్వేషన్ శాతం ఆధారంగా విద్య, ఉద్యోగాలలో ఫలాలను అనుభవిస్తున్నారు. బిసిలు ఎవరి జనాభా దామాషా ప్రకారం వారివారి రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువగా ఉందని రాజ్యాధికారం కోసం ఐక్యంగా ముందుకు కదులుతున్నారు. వెనుకబడిన వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ దేశ వ్యాప్తంగా కులగణన చేయమని పాలకులను డిమాండ్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో మా సీట్లు మాకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను నిలదీస్తున్నారు. బి.సీ రాజ్యాధికారం కోసం నినదీస్తున్నారు.
బిసి ఎబిసిడి వర్గీకరణ ప్రాతిపదికగానే షెడ్యుల్ కులాలకు సంబంధించిన, అందులో అణచివే యబడిన, వివక్షకు గురవుతున్న, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కుంగిపోతున్న ఉప కులాలు ఎబిసిడి వర్గీకరణ చేయాలని మూడు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నాయి. అనాదిగా ఎస్సీ ఉప కులాలు రాజ్యాధికారానికి విద్యకు ఉద్యోగాలకు సమాజానికి దూరమవుతూ వొస్తున్నారు. వర్గీకరణ జరిగితేనే ఉద్యోగ ఉపాధి రంగాలలో మా వాటా మాకు దక్కుతుంది మా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుందని ఉద్యమిస్తున్నారు. ఉపకులాలకు సంబంధించిన వేలాదిమంది భిక్షాటన చేస్తూ సంచార జీవులుగా బతుకు బండిని ఈడుస్తున్నారు. శాశ్వతమైన నివాసాలు లేవు. వర్గీకరణ జరిగితే అలాంటి వారికి గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించే దిశగా ప్రత్యేకమైన నివాస వసతి కల్పించే విధంగా నిర్ణయాలు జరుగుతాయి. షెడ్యూల్ కులాలలోని బక్కచిక్కిన కులాలను బాహ్య ప్రపంచం ముందుకు తీసుకురావొచ్చు. వారి వృత్తులకు చేయూతనివ్వడంతో పాటు, వారి సంప్రదాయాలను గౌరవిస్తూ కాపాడే దిశగా పాల కులు నిర్ణ యాలు తీసుకు నేలా ఒత్తిడి పెంచవచ్చు.
బుద్దిజీవులు నిరంతరం వర్గీకరణ వైపే
చరిత్ర గతిని మొత్తం పరిశీలిస్తే అన్యాయానికి గురవుతున్న వర్గాల వైపే సభ్య సమాజం అండగా నిలబడుతూ వొస్తుంది. అవి ప్రాంతీయ ఉద్య మాలైనా, సామాజిక ఉద్యమాలైనా, దళిత ఉద్య మాలైనా, మహిళా ఉద్యమాలైనా, నక్సలైట్ పోరా టాలైనా.. అనేక ఆటుపోటులను ఎదుర్కొని అణ చివేతకు గురవుతున్న వర్గాల పట్లనే బుద్ది జీవులుగా నిలబడుతూ వొస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని అన్ని రకాల రాజకీయ పార్టీలు లెఫ్ట్ నుంచి రైట్ వరకు, హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు,ఎ స్సీ ఏతర కుల సంఘాలు, సామాజిక న్యాయం కోరే సమతా శక్తులన్నీ ఎస్సీ వర్గీకరణ తో ఏకీభవిస్తూ ప్రత్యక్షంగా కలిసి వస్తున్నాయి. కారణం వర్గీకరణ డిమాండ్ లో రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తావించిన సమన్యాయ సూత్రం దాగి ఉన్నది. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం కూడా అణచివేతకు ఆధిపత్యానికి అసమానతలకు అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిందన్న విష యాన్ని వర్గీకరణ వ్యతిరేక శక్తులు గమనించాలి.
సమైక్య శక్తులు తెలంగాణ మాతోనే కలిసి ఉండాలనే వితండ వాదం తప్ప ఎందుకు కలిసి ఉండాలో ఒక్క కారణం కూడా చెప్పలేకపోయారు.కాని ఆంధ్రా నుండి తెలంగాణ ఎందుకు విడిపోయి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంధో లక్షలాది కారణాలను తెలంగాణ సమాజం ఈ ప్రపంచం ముందు ఉంచింది. విడిపోయినంత మాత్రాన ఇండియా పాకిస్తాన్ లాగా ఎడబాషిపోమని గోరటి వెంకన్న పాట రూపంలో కైగట్టాడు.విడిపోయి కలిసుం దామనే డిమాండ్ అంతిమంగా నెరవేరింది.అదే తరహాలో షెడ్యూల్ కులాలలో ఏబిసిడి వర్గీకరణ ఎందుకు అవసరమో సవాలక్ష కారణాలను దండోర ఉద్యమం ఎత్తి చూపింది. వర్గీకరించబడి ఎవరి ఫలాలను వారు అనుభవిస్తూ సమిష్టి గా రాజ్యాధికారం కోసం దళితులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది దళిత బహుజన మేధో సమాజం నొక్కి చెబుతుంది. లేన ట్లయితే దళితుల పరస్పర మాటల దాడులు ఆధిపత్య వర్గాల విభజించు పాలించు అనే సిద్దాంతాన్నికి ఊత మిచ్చే అవకాశం లేకపోలేదు.దళిత శక్తులు అంతి మంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. మేమెంతమందిమో మాకు అంత వాటా మా అణగారిన కులాల వర్గాల అందరిది అదే బాటని చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది.
అనేక నివేదికలు స్పష్టం చేశాయి..
రాజ్యాంగ పరిధిలో వర్గీకరణ పోరాటం న్యాయ మైనదని దేశవ్యాప్తంగా స్పష్ఠమైనది. ఎస్.సి ఏ బి సి డి వర్గీకరణ న్యాయమైన సమస్య అని పలు సందర్భాలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వేసిన పలు కమిటీలు, పలు కమిషన్ లు నివేదికలతో సహా నిరూపించిన విషయాలు లికిత పూర్వకంగా ప్రస్తా వించబడి ఉన్నాయి. వర్గీకరణ ఆవశ్యకతను స్పష్టం చేశాయి. సామాజిక అధ్యయన వేదికలు కమిషన్లు కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని రూడీ చేశాయి. ఈ విషయాలు మనందరి జీవన గమనంలో ప్రత్యక్షం గా ఉన్నాయి.పలు అధ్యయనాలు మాదిగ ఉపకులాలు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుక బడినట్లు పూర్తిగా ఆధారాలతో సహా బహిరంగపరిచాయి. 2000-2004 సంవత్సరాల మధ్య కాలంలో వర్గీకరణ అమలు కావడంతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాదిగ, ఉప కులాలు లబ్ది పొందినట్లు, తదనంతరం తీవ్రంగా నష్ఠపోయినట్లు గణాంకాలు స్పష్ఠం చేస్తున్నాయి.
కాలయాపన సరికాదు
అనేక అధ్యయనాల ఆధారంగా, చర్చల ఆధారంగా సుదీర్ఘ కాలం తర్వాత గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆగస్టు 1,2024న ఎస్సీ వర్గీకరణ చేయడం న్యాయ బద్దమే అని తీర్పు ఇస్తూ అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పును భారతదే శమంతట ఉన్న అనేక రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు స్వాగతించాయి. తెలంగాణ ముఖ్య మంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా తీర్పు వెలువడిన రోజే స్పందించి దేశంలో మొట్టమొదటగా తెలంగాణలోనే వర్గీకరణ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి ఆరు నెలలు కావొ స్తున్నప్పటికి ఏక సభ్య కమిషన్ తోనే కాలయాపన చేస్తున్నారు.రెండు దళిత జాతుల మధ్య వైష్యమాన్ని పెంచి పోషిస్తున్నారనే అపవాదం ప్రభుత్వం పై లేకపలేదు.అతిపెద్ద న్యాయపరమైన అంశం పరిష్కరిస్తున్నప్పుడు సహజంగా కొంత అవతలిపక్షం నుండి అసంతృప్తి రగులుతుంది. అంతమాత్రాన తత్సారం చేయడం సమాజానికి మంచిది కాదు. వర్గీకరణ ఆలస్యమైతే సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం లేకపోలేదు.
వర్గీకరణతోనే అందరికీ సమన్యాయం
ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా భారత రాజ్యాంగం హమీపడ్డ ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అణచివేయబడుతున్న వర్గాలకు అందించడం ద్వారా ఈ సమాజం నాగరికమైనదని నిరూపించుకునే అవకాశం ఉన్నది.ఇప్పటికే ఎస్సీ ఉపకులాలు సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోవడంలో స్వల్ప స్థాయికి పడిపోయాయి. జనాభా దామాషా ప్రకారం వారి సంక్షేమ ఫలాలు వారికి అందకపోతే తిరిగి ఆ కులాలు, ఆ సమాజం ఎప్పటికీ బతుకు దెరువు పొందలేవు. కాబట్టి భారత రాజ్యాంగం పరిధిలో వారికి అవకాశాలు కల్పించడం అంటే వారి జీవించే హక్కును వారికి వర్తింప చేయడమే.షెడ్యూల్ కులాలలో వివక్షతకు,అవమానాలకు గురవుతున్న వారి యొక్క జీవించే హక్కుకు భరోసా ఇచ్చే విధంగా పాలక వర్గాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.అందరికి సమ న్యాయం జరుగుటకై జనాభా ధామాషా ప్రాతిపదికన ఎస్సీ.ఏ.బి.సి.డి వర్గీకరణ అమలు చేయాలి.వర్గీకరణ కు రాజ్యంగంలోని సామాజిక న్యాయమే ప్రాతిపదిక కావాలి. ఎస్సీ ఉపకులాలలోని అందరికీ సమన్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ వేగవంతంగా అమలు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తుంది.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192