మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు దీరిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మాఘశుద్ధ దశమి నాడు స్వామి వారికి కల్యాణోత్సవం వైభవంగా జరిపిస్తారు.
తూర్పు గోదావరి జిల్లాలో మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేది లో వద్ద బంగాళా ఖాతంలో సంగమి స్తుంది. అంతర్వేది త్రికోణా కారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనర సింహస్వామి పుణ్య తీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్య క్షేత్రం…వశిష్టా నది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలో మీటర్ల మేర ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసర ప్రాంతము లలో, అంతర్వేది గ్రామంలో, సముద్రతీరానికి వెళ్ళు రహదారిలో క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నే శ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, షిర్డీసాయి ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి..
గోదావరీ నదికి ఒక వేపు ఉన్న ‘‘సఖినేటి పల్లి’’ మండలానికి చెందిన ‘‘అంతర్వేది’’ తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు సమీపంలో వుంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించు కుంది. ఇది దక్షిణ కాశిగా పేరు పొందింది.
సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకసారి బ్రహ్మ రుద్ర యాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిం చాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరం పొందుతాడు.
ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి కింద పడిన రక్తపు బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచ నులు ఉద్భవిస్తారు. ఆవరగర్వంతో యజ్ఞయాగాలు చేసే వారిని, గోవుల ను హింసించేవాడు. ఒక సారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలో చనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరు గురు పుత్రులను సంహరించాడు. వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంతో రక్తావలోచనుడుని సంహరించ డానికి వస్తాడు. నరహరి ప్రయో గించిన సుదర్శన చక్రంతో రక్తావ లోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావ లోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడని ప్రతీతి.
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతు లతో కూడి వశిష్టాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించి నట్లు ఇక్కడే కొన్ని రోజులు నివసిం చినట్లు శిలా శాసనాలవల్ల తెలు స్తోంది. ద్వాపర యుగంలో అర్జును డు తీర్థయాత్రలు చేస్తూ ‘అంతర్వే ది’ దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లో, శ్రీనాధ కవిసార్వ భౌముడు ‘హరి విలాసం’లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం 300 ఏళ్ళకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తోంది. పల్లవుల చే నిర్మితమైన తొలి ఆలయం శిథిలమైపోగా మళ్ళీ ఈ ఆలయా న్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది. నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.
మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడైన నృసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవం జరిగిన తర్వాత రోజైన ఏకాదశి నాడు లక్ష్మీ సమేత నృసింహస్వామి నవ వధూవరులై అంగరంగ వైభవంగా రథయాత్ర చేస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని శరాఘా తానికి కుప్పకూలిన భీష్మ పితామ హుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్య మీద ఎదురు చూశాడు. (రథ) సప్తమి, (భీష్మ) అష్టమి, (మధ్వ ) నవమి, (బ్రహ్మా త్మక) దశమి, (భీష్మ) ఏకాదశి రోజుల్లో రోజుకొక్కటి చొప్పున పంచప్రాణాలు వదిలాడని పురాణగాథ. అందుకే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, అంతర్వేది తీర్థ ఏకాదశి అని అంటారు.
ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు. ఆలయానికి దూరంగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన స్థలంలో కళ్యాణ మండపం నిర్మించారు. వేలమంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేసారు. కళ్యాణం అనంతరం ఏకాదశి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ నున్నారు. కార్యక్రమాలలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం, ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి జరగాల్సి ఉంది. 8న రథోత్సవం, చక్రస్నానం (దేవుని సుదర్శన చక్ర పవిత్ర స్నానం) నిర్వహించ బడుతుంది. ఫిబ్రవరి 13న ప్రత్యేక పూజలు, వైభవంగా నిర్వహించే తెప్పోత్సవంతో వేడుకలు ముగుస్తాయి.
` రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494