ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కోరినా, ప్రయోజనం కలగలేదు. 2025-26 వార్షిక బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం లబ్ది పొందే విధంగా కేటాయింపులను చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం గండి పెట్టకపోతే ఇంకా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వొచ్చేది.
12లక్షల వరకు 7 స్లాబ్ ల పేరుతో ట్యాక్స్ తగ్గించడం వల్ల, మధ్యతరగతి ప్రజలకు, ఆయా వర్గాలకు పెద్ద దోహదపడింది ఏమీ లేదు. 12 లక్షల సంపాదన ఉన్న సగటు వేతన జీవులకు 80 వేల వరకు ఆదా అవుతుందని చెప్పినా కేవలం మిత్రపక్షాన్ని సంతృప్తి పరిచేందుకు తప్ప దేశంలోని పేదలకు ఒనగూరింది ఏమీ లేదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొత్త పన్ను విధానంతో కోటిమందికి పైగా పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్గింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని మార్గాలను అన్వేషించి నడుస్తుంది. బడ్జెట్ లో ద్రవ్యలోటు అంచనా 4.9 శాతం నుంచి సవరించిన అంచనా 4.8 శాతానికి వొచ్చింది. మీదికి నిర్మలమ్మ ఎంత డంబాచారం చేసినా సగటు, మధ్యతరగతి ప్రజల బాగోగులు పేనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.
గత పదేండ్లుగా దేశంలోని ధనవంతులకు మేలు చేసిన బడ్జెట్ 2025-26లో కొత్తగా ఊహించుకోవడం హాస్యాస్పదమే. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న 90 మంది బ్యూరోక్రాట్ల లో బడుగుల జీవనశైలి తెల్సిన వాండ్లు రమారమి 10 మంది కంటే ఎక్కువ లేరనే విమర్శ ఉంది.అటువంటిది మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందనే విమర్శ ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు,ప్రతిపాదనలు లేక, కేంద్ర,రాష్ట్రాల మధ్య సయోధ్య లేక నిధులు రాలేదని తెలంగాణ బీజేపీ నాయకులు కుంటిసాకులు చెప్పేవారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినాక భిన్న అభిప్రాయాలు, రెండు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు చోటే మియా, బడే మియాలా కలిసి పోతారు అనుకున్నారు.
అనేక సార్లు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేస్తారా ?అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ కేసీఆర్ అయినా, రేవంత్ అయినా కేటాయింపులు పేలవమే.కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసిందేమిటి? వాళ్ళు ఇచ్చింది ఏమిటీ? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ ను బద్నామ్ చేసినా బీజేపీ 1.65 లక్షల కోట్లతో ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ ఏఐ, ఫ్యూచర్ సిటీ ,మూసి ప్రక్షాళన ,మెట్రో విస్తరించడం కోసం ప్రతిపాదనలు పంపితే గుండు సున్నా కేటాయించడం కేంద్ర ప్రభుత్వం అక్కసు బయటపడింది. ఇంత అక్కసుతో ఫ్యూచర్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా నెలకొల్పుతుందో ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న ఇద్దరు నాయకులు సమాధానం చెప్పాలి.
ఎన్నో ఏండ్లుగా రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ పై సవతి ప్రేమ చూపెట్టిన బీజేపీ ప్రభుత్వం గతంలో మాదిరిగా నీటి ప్రాజెక్టులకు మొండి చేయి చూపింది. కాంగ్రెస్ ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలను త్వరితగతిన పూర్తి చేయకుండా నిధులను కేటాయించడంలో చివరి ప్రాధాన్యంగా చూసింది.దినదిన గండంగా బతుకుబండిని గుంజుకొస్తున్న సామాన్యుడికి కొంత ఊరట కల్గించినా, తెలంగాణ పట్ల తనకున్న అసహనం నిధుల కేటాయింపులో కొట్టొచ్చినట్టు కన్పించింది. మధ్యతరగతిని ఓటు బ్యాంకు గా మార్చే ప్రయత్నంలో 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు ప్రకటించినంత మాత్రాన మధ్య తరగతి సంతృప్తి చెందుతుందా? అన్న ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం ఉంది.
2004లో పేద, మధ్యతరగతి ప్రజల వోట్లను నిర్లక్ష్యం చేసినందుకే వాజపేయి ప్రభుత్వం అధికారానికి దూరమైందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు.కేవలం పన్ను రాయితీ తోనే రాష్ట్రాల్లో పాగా వేయాలనే కలలు నెరవేరుతాయా? అంటే నిజమే అనిపిస్తుంది. బీజేపీ పట్ల మధ్యతరగతిలో ఒకరకమైన ఉదాసీనత పెరుగుతూ వొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయిలో 42పైసలు మాత్రమే వొవస్తున్నాయి. బడ్జెట్ లో కేవలం 2.1 శాతం నిధులు కేటాయించడానికి ఎన్నో షరతులను పెట్టుతుందనే విమర్శ ఉంది. ఎన్డీఏ లో ఉన్నా మిత్రపక్షం బీహార్ మినహా ఆంధ్రప్రదేశ్ కు కూడా ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదంటే అతిశయోక్తి కాదు.
డా।। సంగని మల్లేశ్వర్,
విభాగాధిపలి, జర్నలిజం శాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్ :9866255355