టెక్నాలజీ దుర్వినియోగం- సమాజానికి శాపం

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలు మొదలయ్యాయి.  అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గడించడానికి కృత్రిమ మేథను ప్రవేశ పెడుతున్నాయి. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మానవ జీవితాలను శాసిస్తున్నది.  ప్రయోజనాలతో పాటు అనేక విపరీత పరిణామాలకు కూడా విజ్ఞాన,సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయడం బాధాకరం..”
sunkavalli sathibabu
-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్)
మొ:9704903463.

విజ్ఞానాన్ని విచక్షణతో వినియోగించాలనే జ్ఞానం నశించడంతో సాంకేతిక ప్రపంచం అడ్డదారుల్లో పయనిస్తున్నది. టెక్నాలజీ దుర్వినియోగం సమాజానికి శాపం అని చెప్పక తప్పదు.అర్ధవంతమైన విజ్ఞానమే ప్రపంచ మనుగడను పదికాలాల పాటు నిలబెడుతుంది. విజ్ఞానం వలన విధ్వంసం జరిగితే, ఇక అలాంటి విజ్ఞానాన్ని విస్మరించవలసిందే. అణ్యాయుధాల వలన ప్రపంచం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి మారుతుందో చెప్పలేం. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం  ప్రపంచాన్ని చమురు, గ్యాస్ సంక్షోభంలోకి నెట్టింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య సంవత్సరాల తరబడి జరుగుతున్న యుద్ధం వలన ఉభయ దేశాలు భారీగా నష్టపోవడమే కాకుండా,ప్రపంచం తీవ్రమైన ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది.

పెరిగిన శాస్త్ర విజ్ఞానం ప్రజలకు మేలు చేయాలి కాని ఇలా ప్రజల జీవితాలను విధ్వంసం చేయకూడదు.గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని, సమాజాన్ని సంస్కరించుకోవాలి.అక్షరాలు దిద్ది, పుస్తకాలను చదివి, అహరహం శ్రమించి  అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని, ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా జీవిత సాగరాన్ని నెట్టుకొచ్చే ఓర్పు,నేర్పు గతించిన తరాలకు పుష్కలంగా ఉండేది. ఈ ఆధునిక డిజిటల్ యుగంలో డబ్బుంటే చాలు సౌకర్యవంతమైన జీవితం మన స్వంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవితాలను, భారంగా,అసౌకర్యం గా నెట్టుకొచ్చే కాలం గతించింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం,సైన్స్ ఫలితాలు అరచేతిలో ప్రపంచాన్ని మనముందు సాక్షాత్కరింపచేస్తున్నాయి. నేటి ప్రపంచాన్ని సైన్స్ మరియు టెక్నాలజీ శాసిస్తున్నాయి.

సైన్స్ ను టెక్నాలజీని విభజించి చూడలేము.సైన్స్ అనే మహా వృక్షానికి చెందిన ఫలమే  టెక్నాలజీ. నేడు ప్రపంచం ఇంతగా అభివృద్ది చెందడానికి  పెరిగిన  సాంకేతిక పరిజ్ఞానమే కారణం. అనేక రంగాలు సాంకేతిక పరిజ్ఞానం తో పెనవేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలన్నీ టెక్నాలజీ సాయంతో నడుస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ  అనేక అద్భుతమైన ఫలితాలకు ఆలవాలంగా మారింది.విద్య  వైద్య,ఇంజనీరింగ్, కళా సాంస్కృతిక రంగాలు టెక్నాలజీ వలన వినూత్నమైన రూపం సంతరించుకున్నాయి. అనేక వ్యాధులకు చికిత్స నందించడంలోను, శస్త్ర చికిత్సల్లోను సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగ పడుతున్నది. విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు అందుబాటు లోకి రావడంతో   నేర్చుకునే ప్రక్రియ సులభతరంగా మారింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్  మీడియాలో సరికొత్త మార్పులొచ్చాయి. నేర పరిశోధన లో టెక్నాలజీ పాత్ర కీలకంగా మారింది. సమాచార వ్యవస్థ స్వరూప స్వభావాలు మారిపోయాయి.

ఇంటర్నెట్ లో  సకల సమాచారం లభ్యమవుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా విస్తరించే అవకాశముంది. ఇప్పటికే ఏఐ ప్రకంపనలు మొదలయ్యాయి.  అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ గడించడానికి కృత్రిమ మేథను ప్రవేశ పెడుతున్నాయి. “సైన్స్ అండ్ టెక్నాలజీ” మానవ జీవితాలను శాసిస్తున్నది. ప్రయోజనాలతో పాటు అనేక విపరీత పరిణామాలకు కూడా విజ్ఞాన,సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేయడం బాధాకరం.  ఇది కేవలం మానవ తప్పిదం. సైన్స్ ను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో మంచి చెడుల విచక్షణ అవసరం. ఇప్పటికే సాంఘిక మాధ్యమాలు హోరెత్తి పోతున్నాయి. విద్యార్ధులు, యువతతో పాటు విద్యాధికులు, పెద్దలు సైతం సోషల్ మీడియా కబంధ హస్తాల్లో చిక్కుకుని, వాటికి దాసోహమై మానవ సంబంధాలకు తిలోదకాలిస్తున్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ వలన అనేక యూట్యూబ్ ఛానళ్ళను ప్రజలు యథేచ్ఛగా చూడగలుగుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కంటే యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావమే అధికంగా కనిపిస్తున్నది. అసభ్యకరమైన కంటెంట్ యువత జీవితాలను నాశనం చేస్తున్నది. అనేక ఫోర్న్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి.

ధనార్జనే ధ్యేయంగా భావించి విలువలకు తిలోదకాలిస్తూ, నగ్న సంస్కృతిని ప్రోత్సహిస్తూ, బ్లాక్ మెయిలింగ్ పద్దతులకు పాల్పడడం వలన సమాజంలో ఆటవిక ప్రవర్తన పెరిగి పోయే అవకాశాలు ఏర్పడ్డాయి. మహిళలను, బాలికలను బెదిరిస్తూ, బాధిస్తూ, మానసిక,లైంగిక హింసలకు గురిచేస్తున్న వారిని శిక్షించడం కష్టసాధ్యంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే మోసాలే మానవ నైజం గా మారి, హింసా ప్రవృత్తి పెరిగే పోయే అవకాశముంది. ఆన్ లైన్ గేమింగ్ ప్రక్రియలు వ్యసనంగా మారిపోతున్నాయి.కల్పితాలతో కూడిన కంటెంట్ తో  మానవ జీవితాలు అల్లకల్లోలమయ్యే పరిస్థితులకు సైన్స్ అండ్ టెక్నాలజీ కారణం కారాదు.ఎన్ని  విజయాలు సాధించినా, ప్రపంచం వైజ్ఞానికంగా ఎంతగా   ముందుకు దూసుకుపోతున్నా, శాస్త్రవేత్తల పరిశోధనలు ఆగలేదు. అనేక విషయాలపై నేటికీ విస్తృతంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి.భవిష్యత్తులో మనిషి మృత్యువును కూడా జయించగలడేమో అనే నమ్మకం కలుగుతున్నది. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు ఈ నిజానికి బలం చేకూర్చుతున్నాయి. మనిషి ఆయుస్సును పెంచడానికి  పరిశోధనలు జరుగుతున్నాయి. “ఏజ్ రివర్సింగ్ ప్రాసెస్” ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.

మానవ కణాలను,శరీర అవయవాలను మార్చి,ఎలాంటి రోగాలు లేకుండా  మనిషి వందలాది సంవత్సరాలు జీవించడం కోసం  పరిశోధనలు జరుగుతున్నాయి.  మనిషి మెదడు లో మైక్రో చిప్ అమర్చడానికి జరుగుతున్న ట్రయల్స్ గురించి,చిప్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ ప్రక్రియ గురించి వింటుంటే మానవ జీవితాలు  భవిష్యత్తుల్లో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో ఊహించుకోవడానికే భయం కలుగుతుంది.మానవ మేథస్సుకు కృత్రిమ మేథస్సు తోడు కావడం భవిష్య పరిణామాలపై ఆసక్తితో పాటు, భయోత్పాతం కలగడం సహజం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారకూడదు.శాస్త్ర పరిశోధనలకు ఉపక్రమించే ముందు వాటి వలన ఏర్పడే విపత్కర పరిణామాల గురించి  ముందే ఆలోచించాలి. ఇప్పటికే పెరిగిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వలన మానవ జీవితం అనేక మలుపులు తిరిగింది. కొన్ని ఊహించని పరిణామాలు కూడా సంభవించాయి.

భూగోళం పై కాలుష్యం  విపరీతంగా పెరిగి పోయింది. వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి.  భూ ఉపరితలం వేడెక్కి పోతున్నది. నదులు,ఇతర జలరాశులు అంతరించే ప్రమాదం పొంచి ఉంది. శీతల దేశాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతల వలన తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంది. రసాయనాలతో నిండిన ఆహారాన్ని భుజిస్తూ, కృత్రిమమైన జీవన శైలితో, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నిరంతరం ఔషధాలను ఉపయోగిస్తూ, జీవశ్చవాల్లా  బ్రతుకీడ్చే పరిస్థితుల కు కారణం ఏమిటి?  విజ్ఞానం పెరిగి, వినాశనానికి దారితీస్తే, మానవ మనుగడ అసాధ్యం.  మానవ అవసరాలకు కావలసిన సహజ వనరులు తరిగి పోతున్నాయి. భూగర్భ సంపదను విచక్షణారహితంగా వాడేస్తున్నాం. సముద్రాలను కలుషితం చేస్తున్నాం.ప్రయోగాల పేరుతో అంతరిక్షాన్ని ఒక డంపింగ్ యార్డ్ లా మార్చేస్తున్నాం. ప్రకృతిని విధ్వంసం చేసి, భూగోళాన్ని మృతగోళంగా మార్చే విధంగా మన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రోబోల శకం రాబోతున్నది. మానవ ప్రమేయం లేని “మర మనుషుల లోకం” ఆవిర్భవించబోతున్నది.ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలే.

కాలచక్ర పరిభ్రమణ ప్రక్రియలో భాగంగా ఈ ప్రపంచం అనేక మలుపులు తిరిగింది.అనేక మార్పులకు లోనై, నిరంతరం ఏదో ఒక కొత్తదనాన్ని తనలో ఇముడ్చుకుని,ముందుకు సాగుతున్నది. “కొత్తొక వింత- పాతొక రోత” అన్న చందంగా ఈ భూతలంపై నివసిస్తున్న జనబాహుళ్యం కొంగ్రొత్త జీవన విధానాలను తమ నిత్య జీవితాలకు అన్వయించుకుంటున్నది.అయితే మనతో పాటు ఈ భూగ్రహంపై నివసిస్తున్న ఇతర జీవరాశులు మాత్రం కేవలం ఆహారం కోసం మాత్రమే అన్వేషిస్తూ, యథావిధిగా  జీవిస్తూ, గతిస్తున్నాయి. భూమండలంపై ఏర్పడుతున్న అనేక పరిణామాలను తట్టుకుని,మారుతున్న వాతావరణ పరిస్థితులకు  అనుగుణమైన మార్పులు చేసుకుంటూ, అనేక అంటువ్యాధులను ఎదుర్కొంటూ,  ప్రకృతి విపత్తులను సైతం తట్టుకుంటూ జీవిస్తున్న కారణం గానే మానవజాతి  ఈ భూగ్రహంపై తన అస్థిత్వాన్ని కొనసాగిస్తున్నది.  అయితే మనకంటే భౌతికంగా బలమైన కొన్ని జంతువులు, బలహీనమైన పక్షిజాతులు, క్రిమి కీటకాలు, జలచరాలు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, భూగ్రహం పై ఏర్పడుతున్న మార్పులను తట్టుకోలేక పోతున్నాయి. ఎన్నో జీవరాశులు ఇప్పటికే అంతర్ధానమై పోయాయి. మనుషుల మాదిరిగా కాలాలకతీతంగా నిలబడగలిగే శక్తి సామార్ధ్యాలు ఇతర జీవుల్లో లేక పోవడమే వాటి మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. మానవ ఆలోచనలు, మేథస్సు కారణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది.

“సైన్స్ అండ్ టెక్నాలజీ” ప్రభావంతో నేడు మనమంతా ఎంతో సౌకర్యవంతంగా జీవిస్తున్నాం. ఇలాంటి అనుకూల పరిస్థితులను కాదనుకుని, జంతువుల్లా జీవించాలనుకోవడం జంతు ప్రవృత్తిని అలవరచుకుని, మానవ నాగరికతకు, మానవ జీవన విధానం లోని విశిష్టతకు దూరంగా జరగాలను కోవడం, కేవలం ఏదో విధంగా బ్రతికేయడానికే మార్గాలను అన్వేషించడం దేనికి సంకేతం?  కేవలం బ్రతకడానికే ప్రాధాన్యత నిచ్చే విపరీతమైన ధోరణులను అలవరచు కోవడం మానవ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.  వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతిని స్వార్ధం కోసం వినియోగించడం,  నేరపూరిత ప్రవర్తనతో  ఇతరులను వంచించి, హింసించి, చంపడం, కేవలం తినడానికే బ్రతకడం, బ్రతకడానికి మోసాలు చేయడం  జంతు ప్రవృత్తికి నిదర్శనం.ఇకనైనా ఈ ధోరణి మారాలి.

పెరిగిన విజ్ఞానం మెరుగైన జీవితాలకు సోపానం కావాలి.” సైన్స్ అండ్ టెక్నాలజీ” వినియోగం మనతో పాటు మనతో మమేకమై జీవిస్తున్న ఇతర జీవరాశుల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించకూడదు. ప్రస్తుత వైజ్ఞానిక ఆవిష్కరణలు మనిషిని మృత్యుంజయుడిగా మారుస్తాయో, మృత్యువుకు ఎరగా వేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. కొంతమంది మేథావులు, శాస్త్రవేత్తలు భూగోళం పై సంభవిస్తున్న వేగవంతమైన మార్పుల వలన సమీప భవిష్యత్తులో మానవాళి ప్రమాదంలోకి నెట్టబడుతుందని, ఫలితంగా భూమి నిర్జీవమయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరికలు చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే జరుగుతున్న పరిణామాల ఫలితాలను చవిచూస్తున్నాం. జరగబోయే విపత్కర పరిణామాల గురించి కూడా ఆలోచించి,  అవసరమైనంత మేరకే విజ్ఞాన,సాంకేతిక శాస్త్ర ఫలితాలను వినియోగించాలి. విజ్ఞానాన్ని విచక్షణతో వినియోగించాలి. యుద్ధాలను నివారించాలి. జీవ వైవిధ్యంతో, పచ్చని  ప్రకృతితో  ప్రపంచం  కళకళ లాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *