తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

మలేషియా పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు

ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : తెలంగాణలో తాము తీసుకువొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేని అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం నాడు కౌలాంలపూర్ లో అక్కడి పారిశ్రమిక వేత్తలతో సమావేశమయ్యారు. స్థానిక తెలంగాణా ఎన్నారైలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మలేషియా- భారత్ ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. పెట్టుబడులతో తమ దేశానికి వొచ్చే వారందరికి హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ గా ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. డిసెంబర్‌లోగా తెలంగాణ సందర్శించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని మలేషియా పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.

రాజకీయాల్లోకి వొచ్చి 25 ఏళ్లు

అనూహ్య పరిస్థితుల్లో ప్రజాసేవలోకి వొచ్చిన తాను ప్రజాప్రతినిధిగా నవంబర్ 10 తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం ఇక్కడి మిత్రులు చెప్పేదాక తనకు గుర్తు లేదని మంత్రి శ్రీధ‌ర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలో ఎంతో ప్రాధాన్యతనిచ్చి తనను ప్రోత్సహిస్తూ వొచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల, మల్లిఖార్జున్ ఖర్గేలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేసానని, వారంతా తన పట్ల ఎంతో అభిమానం కనబర్చారని తెలిపారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న సహచరులకు, తన వెంట నిలిచిన ప్రజలకు మంత్రి శ్రీధ‌ర్‌బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *