- అందరూ స్వచ్ఛతాహి సేవలో భాగస్వాములు కావాలి
- రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో స్టేడియాన్ని సందర్శించారు. హుస్నాబాద్ (Husnabad ) క్రీడల అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారులు ,పీఈటి ల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. అనంతరం స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించి మ్యాచ్ లను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రీడాకారులతో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. స్వచ్చత ఈ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. మినీ స్టీడియన్ని క్రీడాకారులు, ప్రభుత్వ పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని మంచి పారితోషికం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాస్కెట్ బాల్ కోర్టులో క్రీడాకారులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని సూచించారు.అనంతరం పక్కనే ఉన్న మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
మోడల్ స్కూల్ లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. పదవ తరగతిలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రోడ్డును, ప్రాంగణాన్ని పరిశీలించారు.. వర్షానికి డిగ్రీ కాలేజీ భవనం ముంపునకు గురవుతుండడంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.. అనంతరం గిరిజన బాలికల వసతిగృహన్ని సందర్శించారు. హాస్టల్ కి కాంపౌండ్ కావాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు.
కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు..
వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ : హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛతా హి సేవ -2024 కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తర్వాత అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలను స్వయంగా మంత్రి పొన్నం తొలగించారు. చెరువులో ఉన్న వ్యర్థాలను పారతో ఎత్తి ట్రాక్టర్ లో పోశారు. ఈసందర్భంగ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో అత్యుత్సాహంగా జరుపుకున్నామని, నిమజ్జనంతో కార్యక్రమం ముగియలేదని, నిమజ్జనం తరువాత మనం ఏ చెరువులో వేసిన వ్యర్థాలను తొలగించిన తర్వాతే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిర్వాహకులు గణేష్ ఉత్సవాల్లో క్రియశీలకంగా ఉన్నవారు స్వచ్చ భారత్ ,స్వచ్చ తెలంగాణ లో మీ వాడ, మీ ఊళ్లలో మీరే స్వయంగా జలాశయాల్లో గణేష్ నిమజ్జనం తర్వాత చెరువులో వ్యర్థాలను తొలగించాలని కోరారు. హుస్నాబాద్ ను స్వచ్ఛ పట్టణంగా మార్చుకోవడానికి మున్సిపల్ సిబ్బంది పని చేస్తున్నారని, ప్రతి ఒక్కరు స్వచ్చతలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో ఇతర అధికారులు పాల్గొన్నారు.





