అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ
దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర పరువు తీశారు.
అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రామన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు. మొదటి రోజు శాసనసభకు అదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద నిరసనగా టీషర్ట్స్ వేసుకొని వొస్తే అడ్డుకున్నారని తెలిపారు. ఇద్దరి దోస్తీకి కట్టుబడి సభ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. నేడు రాజ్ భవన్ వద్ద అదానీ అవినీతి గురించి మాట్లాడినట్లు సర్కస్ చేశాడని మండిపడ్డారు.అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించే మాట్లాడాడు తప్ప, అదానీ అవినీతి గురించి మాట్లాడింది తక్కువ అని అన్నారు.
మీ పోరాటం అదాని మీద అయితే మొదటి రోజు మమ్మల్ని ఎందుకు అసెంబ్లీ రాకుండా అడ్డుకున్నారు. నిరసన తెలిపే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు. మేము అడుతున్నా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టడం లేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు. దావోస్ వెళ్లి అదానీతో 12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నారు. మీకు నిజంగా అదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు వెంటనే అగ్రిమెంట్లు రద్దు చేయాలి. అదానీ గ్రీన్ తో 5వేల కోట్ల కాంట్రాక్టు, వంద మెగావాట్ల డేటా సెంటర్ కు 5వేల కోట్లకు, 1400 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ డిఫెన్స్ ఫేస్ కోసం వెయ్యి కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. మొత్తంగా 12400 కోట్ల అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. మీ మాటల్లో నిజాయితీ ఉంటే, వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు 12400 రద్దు చేసుకోవాలన్నారు. అగ్రిమెంట్లు రద్దు చేసి రేవంత్ రెడ్డి తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
నేతి బీరకాయలో నీతి ఎంతనో, నీ పోరాటంలో నిజాయితీ అంతే అని ఎద్దేవా చేశారు. రామన్నపేటలో డ్రైపోర్టు కోసం ల్యాండ్ ఇస్తే సిమెంట్ ఫ్యాక్టీరికి అనుమతి ఇచ్చారు. అదానీ కోసం పోలీసులను పెట్టి అరెస్టులు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ చేశారు. అదానీకి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారు. ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్, సర్కస్ ఫీట్లు తప్ప ఇంకేం లేదు. మీ డబుల్ స్టాండర్డ్ కు మీ చిత్తశుద్ది లేని పోరాటం నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు.
అదానీ దేశ పరువు తీశాడని రేవంత్ రాజ్ భవన్ వద్ద అన్నాడని, అదే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. అదానీకి రెడ్ కార్పెట్ వేసావు రాష్ట్ర పరువు తీశాడని, దిల్లీలో పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పరువును తీశారని అదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద రేపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్ భవన్ వద్ద ఆందోళనతో సీఎం రేవంత్ ట్రాఫిక్ జాం చేశాడని, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ధర్నాలో పాల్గొన్న అందరిపై కేసులు పెట్టాలని, చట్టం అందరికీ సమానమైతే వారి మీద కూడా కేసులు పెట్టాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.