అభ్యర్థుల ఎంపికపై కసరత్తు..
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
రాష్ట్రంలో త్వరలో ఖాలీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే అందుకు సమవుజ్జీగా ఉండే తమ అభ్యర్ధులను బరిలోకి దింపాలను కుంటున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ల పదవీకాలం వొచ్చే సంవత్సరం మార్జి 29తో ముగియనుండడంతో పార్టీలన్నీ ఇప్పుడు ఆ స్థానాలపైనే దృష్టి పెడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ మూడు స్థానాల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకోవడంద్వారా ప్రజల్లో తమ పాలన పట్ల నమ్మకం ఏర్పడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చూస్తోంది. అందుకే అభ్యర్ధుల ఎంపికపైన పెద్దఎత్తున కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఒకసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో ముఖ్యనేతలు సమావేశమై అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీకాలం మార్చితో ముగుస్తుండడంతో ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించ నున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, వివాద• •హితుడు కావడంతో జీవన్‌రెడ్డికే మరో అవకాశం ఇస్తే ఎలాఉంటుందన్నదానిపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానిక నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వంపై అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఆయన రాష్ట్రముఖ్యమంత్రి తీరుపై అలకవహించిన విషయం తెలిసిందే. ఆయన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం జగిత్యాలలో ఎంఎల్‌ఏగా గెలిచిన డాక్టర్ సంజయ్‌ని తన ప్రమేయం లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆయన పార్టీ వీడుతానంటూ ప్రకటించడం, రాష్ట్ర నాయకులు మొదలు అధిష్ఠానం ఆయన్ను అనునయించడం తెలిసిందే. అదేక్రమంలో ఆయన అనుచరుడు గంగారెడ్డి హత్య ఆయన్ను మరింత ఆవేదనకు గురిచేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆయనకే మరో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు వార్తలు వొస్తున్నాయి. ఇదిలాఉంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎంఎల్‌ఏలను కలిగిఉన్న భారతీయ జనతాపార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం రెండింటినైనా కైవసం చేసుకునే విధంగా ప్రణాళిక రచిస్తోంది. ఆ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్నా, పోటీకి పలువురు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అనధికారికంగా కొన్నిపేర్లు మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు జి. అంజిరెడ్డి, మంచిర్యాల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావుతోపాటు మాజీ ఎంఎల్‌ఏ గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడి ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తమరెడ్డి పదవీ కాలంతోపాటు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం కూడా మార్చి 29తో ముగుస్తుండడంతో ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్, బిజెపి నుం,ఇ పోటీచేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు స్థానాల అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తుండగా బిజెపి నుండి పెద్ద సంఖ్యలో పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు, గతంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన వారు, పిఆర్‌టియు మాజీ అధ్యక్షులపేర్లు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతుందా లేదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ ఎన్నికల విషయంలో పై రెండు పార్టీలు చూపిస్తున్న ఆసక్తిని బిఆర్‌ఎస్ కనబర్చకపోవడం ఈ అనుమానానికి బలాన్ని చేకూరుస్తోంది. గతంలో కన్నా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. రాజకీయ పార్టీలతోపాటు, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఇండిపెండెంట్ అభ్యర్దులు వోటర్లను నామోదు చేయించడంలో చూపిస్తున్న చొరవ బిఆర్‌ఎస్‌లో కనిపించడంలేదు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడమేగాక దూకుడుగా దూసుకుపోతున్న కాంగ్రెస్, బిజెపిలను తట్టుకుని తమ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిఉంది. దానికితగినట్లు అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఆ పార్టీ ఇంకా కసరత్తు మొదలుపెట్టినట్లు కూడా లేదు. దీంతో ఆ పార్టీ వర్గాలు కూడా అయోమయంలో పడినట్లు తెలుస్తోంది.