కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో త్వరలో జరుగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన బడ్జెట్‌గానే ఉంది . పక్క రాష్ట్రానికి కేటాయించిన మాత్రంగానైనా తెలంగాణకు కేటాయింపులు ఇవ్వకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి నేటి వరకు విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటున్న విన్నపాలను కేంద్రం పెడచెవిన పెడుతూనే ఉంది. విభజన హామీలంటే రెండు రాష్ట్రాలకు సంబంధముంటుంది. కాని, ఏపిని ఒక దృష్టితో, తెలంగాణను మరో దృష్టితో చూస్తున్నదనడానికి ఈ బడ్జెట్ కేటాయింపులే రుజువుచేస్తున్నాయి . ఏపీలో తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం కేంద్రంలోని బిజెపికి మిత్రపక్షంగా ఉండడంవల్లే భారీ స్థాయిలో ఏపీకి నిధులు కేటాయిస్తే కేంద్రానికి ఫెడరల్ స్ఫూర్తిలేదనే భావించాల్సి ఉంటుంది.
గత బడ్జట్‌లోనే తెలంగాణకు సున్నా కేటాయింపులకు నిరసనగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రం ‘గాడిద గుడ్డు’ ఇచ్చిందంటూ గుడ్డుతో ప్రదర్శన నిర్వహించిన విషయం తెలియందికాదు. అయినా కేంద్రం ఈసారి కూడా ఏమాత్రం స్పందించినట్లు కనిపించలేదు. తెలంగాణరాష్ట్రం నుండి దక్షిణాది లో తమ జైత్రయాత్ర ప్రారంభిస్తామని చాటిన బిజెపికి గత ఎన్నికల్లో చుక్కెదురు అయింది. అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణ ప్రజలు పార్లమెంటు, అసెంబ్లీ సీట్లను పెంచారు. రాష్ట్రంనుండి ఎనిమిదిమంది ఎంపీలను, ఎనిమిది మంది ఎంఎల్‌ఏలను గెలిపించుకున్న బిజెపి కనీసంగానైనా తెలంగాణానికి కేటాయింపులు చేయలేదు. అయినప్పటికీ ఇది సమన్యాయం చేసే డ్రీమ్ బడ్జెట్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొంటుండగా, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడు చూడలేదని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళపాటు తాము అధికారంలో ఉన్నప్పటినుండి రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలని అనేకసార్లు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు విజ్ఞాపనలు చేసుకున్నా ఏనాడు పట్టించుకోలేదంటున్నారు. పదకొండు ఏండ్ల తర్వాతయినా రాష్ట్ర వినతులకు స్పందన లభిస్తుందని యావత్ తెలంగాణ ఎదిరిచూపులు ఎండమావులే అయ్యాయంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకసార్లు దిల్లీ కి చక్కర్లు కొట్టినా సాధించింది మాత్రం ఏమీలేదంటున్నారు. ఏపికి పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేటాయించిన ప్రభుత్వం తెలంగాణలో కనీసం ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ ఏళ్ళతరబడి మొరపెట్టుకున్నా వినిపించుకో పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరంతోపాటు అమరావతికి 15వేల కోట్లను, పారిశ్రామికీకరణకు, వైజాగ్,చెన్న్టె కారిడార్‌కు, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికోసం నిధులు కేటాయిస్తున్న క్రమంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు కేంద్రానికి గుర్తుకు రాకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు.