- ఆయన ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి
- గద్దర్ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు..
- అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం..
- హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ భావజాలాన్ని యావత్తు క్యాబినెట్ నమ్ముతుందని, ఆయన గౌరవాన్ని ఆకాశానంటే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. అందరూ చదువుకోవాలన్న గద్దర్ ఆలోచన ప్రకారమే తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిందన్నారు. గద్దర్ ఆలోచనలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు తరాలకు అందించడానికి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తత్వానికి సరి హద్దులు లేకుండా అనేక తత్వాలను దాటి ఆలోచన చేసిన గొప్ప మేధావి గద్దర్ అని ఆయన లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మనందరి అదృష్టం, గర్వకారణం.
నంది అవార్డుల స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. గత దశాబ్ద కాలంగా అవార్డులను మరిచిన సినిమా కళాకారులకు వొచ్చే ఉగాదిన గద్దర్ పేరిట అవార్డులు ప్రదానం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని పాటగా మార్చి ప్రజలను ఉద్యమాల వైపు నడిపించిన గొప్ప కవి, గాయకుడు గద్దర్ జనజీవనంలో ఉన్న సంఘర్షణను, సమాజంలో మహిళలు పడుతున్న బాధలను తన తల్లి రూపంలో పాట రాసి పాడి వినిపించిన మహిళా పక్షపాతి గద్దర్ అని అన్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటతో యావత్తు తెలంగాణను కదిలించారని, ఉద్యమంలో నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులు వేసిన గొప్ప పోరాట యోధుడు గద్దర్ అని అన్నారు. మా వల్లనే తెలంగాణ రాష్ట్రం వొచ్చింది.. తెలంగాణ కోసమే మా పార్టీ పుట్టిందని చెప్పుకునే వారి కంటే ముందే తెలంగాణ కోసం పోరాడింది గద్దర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించారని కొనియాడారు. ప్రగతి భవన్ ముందు గంటల కొద్ది నిరీక్షించిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడం యావత్తు తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని డిప్యూటీ సీఎం అన్నారు.
గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా భావిస్తున్నామని సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వనప్పటికీ గద్దర్ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతాం. ఎక్కడ తగ్గనీయం. దేశంలోని సకల సమస్యలకు పరిష్కారం భారత రాజ్యాంగం ఒకటే సమాధానం చెప్పగలదని రాజ్యాంగాన్ని పట్టుకొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులను గద్దర్ కలిశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది దేశాన్ని కాపాడుతుందని గద్దర్ బలంగా నమ్మారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారే గద్దర్ పై తప్పుడు ప్రచారం చేస్తారు. గద్దర్ ఆలోచనలను ఈ ప్రభుత్వం పునికి పుచ్చుకున్నందునే అనేక ప్రజా పథకాలు తీసుకొచ్చింది. అసమానతలు లేని సమాజం రూపొందించాలన్న గద్దర్ ఆలోచననే ప్రజా ప్రభుత్వం ఆచరిస్తున్నది. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.