పొన్నం బృందానికి కేసీఆర్ లంచ్ ఆతిథ్యం?
అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేక కలిసి ఆహ్వానాలు
ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు: మంత్రి పొన్నం
పొన్నం బృందానికి స్వాగతం, వీడ్కోలు పలికిన మాజీ ఎంపి సంతోష్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలోనే ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ బృందం ఆహ్వాన పత్రికను అందజేసింది. సచివాలయ ఆవరణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కార్ 20అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నెల 9న చాలా గ్రాండ్‌గా ప్రారంభించడానికి చకచక ఏర్పాట్లు చేస్తుంది.
దీనిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను, ప్రముఖులను కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను రాష్ట్ర మంత్రి పొన్నం నేతృత్వంలోని ప్రోటోకాల్ బృందం ముఖ్యులను ప్రత్యేకంగా కలుస్తూ ఆహ్వాన పత్రికను అందజేస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సిఎం, గులాబీ దళపతి అయిన కేసీఆర్‌ను శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లిలో గల తన వ్యవసాయక్షేత్రానికి మంత్రి పొన్నం నేతృత్వంలోని బృందం వొచ్చింది. ఫాంహౌస్‌కు వొచ్చిన పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఫాంహౌస్‌లో మాజీ సిఎం కేసీఆర్‌ను కలిసిన పొన్నంం తొలుత ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాను కప్పి ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావల్సిందిగా ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. పొన్నంను కూడా కేసీఆర్ మర్యాదపూర్వకంగా శాలువాను కప్పారని సమాచారం. కేసీఆర్ ఫాం హౌస్‌లో సుమారుగా గంటన్నరసేపు ఉన్న పొన్నం బృందంకు కేసీఆర్ లంచ్ ఆతిథ్యం ఇచ్చి గౌరవించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రి పొన్నం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢల్లీి కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు..
అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేకంగా కలిసి ఆహ్వానాలు: మంత్రి పొన్నం
ఈ నెల 9న రాష్ట్ర సచివాలయ ఆవరణలో 20అడుగల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సిఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లిలో గల ఆయన ఫాంహౌస్‌లో కలిసి ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేసిన అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను కలిసి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించామనీ, ఈ చర్చలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. అభివృద్ధిలో భాగంగా ప్రజాపాలన`విజయోత్సవాలలో అందరూ కలిసి పాల్గొనేందుకుగానూ ప్రత్యేకంగా అందర్నీ కలిసి ఆహ్వానిస్తున్నామన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు. మంత్రి బృందానికి మాజీ ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు బట్టు అంజిరెడ్డి, ములుగు జహంగీర్ తదితరులు ఆహ్వానం పలికారు. వీడ్కోలు పలికారు.
ఓ వైపు నిరసనలు…మరోవైపు ఆహ్వానాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి ఏడాది అయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని సర్కార్ రాష్ట్రంలో పెద్దయెత్తున సంబరాలు నిర్వహిస్తోంది. ప్రజాపాలన`విజయోత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సచివాలయంలో 20అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది. దీనిలో భాగంగానే గవర్నర్, ప్రతిపక్షపార్టీల నేతలను, ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ చీఫ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సిఎం కేసీఆర్‌కు కూడా ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రిక అందింది. ఏడాది కాలంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో మాటల యుద్ధం కాస్త గృహ నిర్బంధాలు, కేసులు, అరెస్టులు, జైలు వరకు వెళ్లాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు, నిరసనలకు పిలుపున్చిన ఈ తరుణంలో ప్రభుత్వం తరపున బిఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేయడం రాష్ట్రంలో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. అయితే, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా లేదా? అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. చూడాలి మరి!