అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు

  • ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి
  • బిఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క ధ్వ‌జం

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వోట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. న‌ల్ల‌గొండ‌లో కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఆమె ఫైర్ అయ్యారు. ఇండ్ల నిర్మాణ వ్య‌యాన్ని రూ. 5 నుంచి రూ.3 ల‌క్ష‌ల‌కు త‌గ్గించి, ఇంట్లో కూర్చొని ల‌బ్దిదారుల జాబితాను రెడీ చేస్తే..ప్ర‌జ‌లు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టార‌ని గుర్తు చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప‌థ‌కాల అర్హుల‌ను ఎంపిక చేస్తుంటే త‌ట్టుకోలేక అమాయ‌కుల‌ను ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా ప్రోత్స‌హించి రాజ‌కీయాలు చేస్తోంది బీఆర్ఎస్ కాదా అని  సీత‌క్క ప్రశ్నించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు..అధికారం పోగానే అరుపులు అన్న‌ట్లుగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

2023 జూన్, జూలై మాసాల్లో వేయాల్సిన రైతు బంధు నిధుల‌ను.. న‌వంబ‌ర్ లో ఎన్నిక‌ల రోజు వేసేందుకు బీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తే ఎన్నిక‌ల క‌మిష‌న్ అడ్డు చెప్పింద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేశారు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డ హ‌మీల వ‌ర్షం కురిపించి.. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడుతో స‌హా ఎక్క‌డ ఉపఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డే రైతు బంధు నిధులు విడుద‌ల చేసిన ఘ‌న‌త బీఆర్‌ఎస్ కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు.

నాట్ల ముందు కాకుండా..వోట్ల ముందు నిధులు విడుద‌ల చేసినందుకే ప్ర‌జ‌లు బుద్ది చెప్పార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించారని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. అధికారం దూరం కావడాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ నోరు పారేసుకుంటున్నార‌ని సీత‌క్క మండిప‌డ్డారు. ఉచిత ఎరువులు, పంట బోన‌స్ హ‌మీల‌ను విస్మ‌రించిదెవ‌ర‌ని కేటీఆర్ ను మంత్రి సీత‌క్క ప్ర‌శ్నించారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓడించినా ఆత్మ‌ప‌రిశీలన‌ చేసుకోకుండా…ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద‌కు ప‌రిమితమైతే లాభం లేద‌ని సీత‌క్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page