వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు
•భారీగా తరలివొచ్చిన అభిమానులతో
కోలాహలంగా ఎరవెల్లి నివాసం
•మిన్నంటిన జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలు
•శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివొచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల కోలాహలంతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సందడి నెలకొంది. ఎర్రవెల్లి పరిసరాలు వందలాది వాహనాలతో నిండిపోయాయి. కెసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉద్వేగంతో నినాదాలు చేశారు. కేసీఆర్ జిందాబాద్.. తెలంగాణ జిందాబాద్… కెసిఆర్ రావాలి.. సీఎం కేసీఆర్ నినాదాలతో నివాస ప్రాంగణ పరిసరాలు దద్దరిల్లాయి.
తనను చూసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వొచ్చిన శ్రేణులను పేరుపేరునా పలకరిస్తూ నాలుగు గంటల పాటు నిరంతరాయంగా నిలబడి వారితో ఫొటోలు దిగారు. తమ అభిమాన నాయకుడిని, తెలంగాణ ప్రగతి ప్రధాతను కలిసినప్పుడు అభినందనలు తెలుపుతూ పూల బొకేలను శాలువాలు, ఫొటోలను పుస్తకాలను అందించారు. కొందరు అభిమానుల పలు రకాల సృజనాత్మక భావ ప్రకటన రూపాలను కేసీఆర్ స్వీకరించారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు తన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళారూపాలను కేసీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బిఆర్‌ఎస్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు అధినేత కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.