ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్మూ కశ్మీర్ లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫిరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం వోట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి.
ముఖ్యమంత్రి ఎవరు?
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్సభ సభ్యులు ఇంజినీర్ రషీద్ కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.