సెమీ కండక్టర్ల విషయంలో దూసుకెళ్తోన్న భారత్

– యూనికార్న్ సంస్థలు వందకు చేరాయని ప్రకటన
– నెదర్లాండ్స్ పర్యనటలో ప్రధాని మోదీ
– మన సంస్కృతీ సంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు

న్యూదిల్లీ, మే 16: భారత దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సెకండక్టర్ల విషయంలో కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులను కలిశారు. ఈ సందర్భంగా ఎనఆరఐలపై ప్రశంసలు కురిపించారు. లక్ష్యాలను అధిగమించి వారు పని చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం, మాటామంతీ నిర్వహించారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.. నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.. భారత్‌లో ఒకప్పుడు కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలే ఉండేవి.. ఇప్పుడు వందకుపైగా ఉన్నాయి.. భారత్‌లో సెమీ కండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి.. మేడిన్ ఇండియా చిప్‌లు తయారవుతున్నాయి.. ఏఐ సమ్మిట్, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగాం’ అని మోదీ తెలిపారు. ఇంతటి ప్రేమ, ఉత్సాహాన్ని చూసి నెదర్లాండ్స్‌లో ఉన్నానన్న సంగతి ఒక్క క్షణం మర్చిపోయాను.. భారత్‌లోనే ఓ ఉత్సవానికి హాజరైనట్లు అనిపించిందన్నారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేసిన సేవకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు అని చెప్పారు. పూర్వీకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను వదిలేశారు.. కానీ కొన్ని విషయాలు ఎల్లప్పుడూ వారితోనే ఉండిపోయాయి అని మోదీ అన్నారు. భారతదేశ మట్టి పరిమళం, పండుగల జ్ఞాపకాలు, భక్తి గీతాల రాగాలు, పూర్వీకులు అందించిన విలువలు వారితోనే ఉన్నాయన్నారు. కాలక్రమేణా ఎన్నో సంస్కృతులు కనుమరుగయ్యాయనే వాస్తవానికి మానవ చరిత్రే సాక్ష్యం. కానీ భారతదేశ విభిన్న సంస్కృతి ఇప్పటికీ మన ప్రజల హృదయాల్లో బలంగా ఉంది. తరాలు మారాయి, దేశాలు మారాయి, పరిసరాలు మారాయి.. కానీ కుటుంబ విలువలు, మనం ఒక సమూహానికి చెందినవారమనే భావన ఎన్నడూ మారలేదు అని అన్నారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున 2014 మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. దశాబ్దాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి కోట్లాదిమంది భారతీయుల నమ్మకం నన్ను ఆగనివ్వదు, అలసిపోనివ్వదు’ అని మోదీ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *