ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు
సహాయక చర్యలో ఇప్పటికీ సరైన పురోగతి లేదు
ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు
ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు అవుతోందని, మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషాద ఘటనలో చిక్కుకున్నవారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొందని, ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప, మిగతా ఏడుగురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకరమని అన్నారు. పొట్టకూటి కోసం వొచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ఎందుకింత జాప్యం జరుగుతున్నది. కారణాలు అంతుపట్టడం లేదు. సొరంగం కూలడం వెనుక, ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి ఇప్పటికీ బయటకు తీసుకు రాకపోవడం వెనుక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉందని విమర్శించారు.
భూ భౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి, మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలు అప్రమత్తం చేసినా, పట్టించుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో 8 నిండు ప్రాణాలను మృత్యు కుహరంలోకి నెట్టింది. జరిగిన ప్రమాదానికి, బాధితులు అనుభవిస్తున్న క్షోభకు, వారి కుటుంబాలు పడుతున్న తీవ్ర వేదనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని హరీష్ రావు అన్నారు. తమ వాళ్లు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియక, వారి కుటుంబాలన్నీ కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి.
మా వాళ్లు బతికి ఉన్నారా.. మరణించారా? రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి లేనే లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి. గల్లంతైన వారి జాడ కనుక్కోవాలి. నెల రోజులుగా ఎస్ ఎల్ బి సి సొరంగం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు బయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.