అవయవదానం బిల్లు అందరికీ ఉపయోగకరం
దాత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి..
అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు
అవయవదానంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు పెట్టిన బిల్లు వీరందరికీ ఎంతో ఊరట కలిగిస్తుందని తెలిపారు. అవయవదానం బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కు అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా స్వాప్ ద్వారా పరస్పరం అవయవాదనం చేసుకునే అవకాశం కలుగుతుంది. అంతేగాకుండా అవయవాల మార్పిడి దందా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు.
ఇప్పటివరకు బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని న్యూరో ఫిజీషియన్లు మాత్రమే నిర్ధారించే వారు. ఈ బిల్లు ద్వారా డాక్టర్లు అందరూ నిర్ధారణ చేసే అవకాశం కల్పించారు. దీంతో త్వరగా నిర్ధారణ చేసి, అవయవ దానం చేసే అవకాశం కలుగుతుంది. జీవన్ దాన్ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 189 అవయవ మార్పిడులు మాత్రమే జరిగితే… బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 అవయవ మార్పిడులను జరిపామని హరీష్ రావు వెల్లడించారు.
దేశంలో అత్యధిక అవయవ దానాలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం. తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు కూడా పొందింది. ఒకపుడు అవయవదానానికి అమెరికా, లండన్ వెళ్లాల్సి వొచ్చేది. బీఆర్ఎస్ హయాంలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వాసుపత్రుల్లో 609 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవ మార్పిడి ఖరీదైన చికిత్స, పేదోళ్లు చేసుకోలేరు అనుకుంటారు, కానీ, కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవ మార్పిడి చేశాం. 20 లక్షల ఖర్చయ్యేవి నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానలో చేశాం. సంవత్సరం పాటు మందులు కూడా అందించాం.
కుటుంబీకులు త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. అవయవ దానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించాలి. ఇలాంటి ప్రత్యేకతలు వారికి కల్పిస్తే అవయవదానం మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.