•ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స.. కోలుకుంటున్న పేషెంట్
•డాక్టర్లను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
•డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
•అవయవదానంపై అవగాహన కల్పించాలని సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8: తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి నిమ్స్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మరో యువకుడి గుండెను, ఈ 19 ఏండ్ల హైదరాబాద్ యువకుడికి విజయవంతంగా మార్పిడి చేశారు. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏండ్ల యువకుడు.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్‌కుమార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది.
దీంతో హార్ట్‌ను నిమ్స్‌కు తరలించి, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని టీమ్ అనిల్‌కుమార్‌కు అమర్చింది. ఆరోగ్యశ్రీ కింద అనిల్‌కుమార్‌కు ఉచితంగా అవయవ మార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వివరించారు. నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు. ( 2024, 2025లో కలిపి మొత్తం 87 ట్రాన్స్‌ప్లాంటేషన్లు) గతేడాది నిమ్స్‌లో ఒక వ్యక్తికి హార్ట్, లంగ్ రెండూ ఒకేసారి ట్రాన్స్‌ప్లాంట్ చేశామని బీరప్ప తెలిపారు. దేశంలోని ప్రభుత్వ దవాఖాన్లలో, ఒక్క నిమ్స్‌లో మాత్రమే ఇలా ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగాయని తెలిపారు.
నీమ్స్ డాక్టర్లు, సిబ్బందికి మంత్రి అభినందనలు
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కూడా పేషెంట్ల బాగోగులను పర్యవేక్షించాలని, వారికి అవసరమైన వైద్య సేవలను కొనసాగించాలని ఆయన సూచించారు. నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యువకుడికి గుండె దానం చేసిన దాత కుటుంబ సభ్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉండి కూడా, అతని అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశారని ప్రశంసించారు.
వారికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకొచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. మరొకరికి పునర్జన్మను ప్రసాదించే అవయవాలను మట్టిలో వృథాగా కలిసిపోనియొద్దన్నారు. అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్, డాక్టర్ భూషణ్ రాజుకు మంత్రి సూచించారు. అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అవయవ దానానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడికి కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.