ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్రశ్నించరెందుకు?
త్వరలో ఎస్ఎల్‌బిసి టన్నెల్ ను సదర్శిస్తాం..
మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5 నుంచి 10 లక్షల వరకు ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారని వీరిని ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ప్రశ్నించలేదని మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్ అయితే ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదని, సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? అని అడిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు టిపిసిసి క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి నిన్న వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని అన్నారు. ‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారులుగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవు. నా 46ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదు’’ అని చిన్నారెడ్డి గారు బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు.కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు.బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ చేపడితే భట్టి, ఉత్తం, సీతక్క, కోదండరాంలు పేద ప్రజల రక్తం తాగే స్కీం అన్నారు. జనాలను రెచ్చగొట్టారు. మేం అధికారంలోకి వొస్తే ఉచితంగా చేస్తామన్నారు. అధికారంలోకి వొచ్చిన తర్వాత ఫీజులు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని అన్నారు. కోదండరాం ఉచితంగా చేస్తామని చెప్పారు ఇపుడు ఎందుకు మాట్లాడరని అని ప్రశ్నించారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో డబ్బులు పిండటం లేదని అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆషాడం సేల్, దీపావళి బొనాంజ, దంతేరస్ ఆఫర్ల మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ప్రజలు స్టేట్స్ మెన్ కావాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు సేల్స్ మెన్లుగా తయారయ్యారు. ముందు అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నారు. ఇప్పుడు 25శాతం డిస్కౌంటహో అని జేబులు ఖాలీ చేసే ప్రణాళిక వేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు కట్టకుండా వాగ్దానం ప్రకారం ఫ్రీ గా చేయాలని డిమాండ్ చేయండి. ప్రజలు ఎల్ ఆర్ ఎస్ కట్టకండి. చచ్చినట్లు ఫ్రీగా చేయాల్సి వొస్తుంది. ఇటీవల ఒక దినపత్రిక ఎడిటర్ ఇప్పుడు తెలంగాణనే దిల్లీ కాంగ్రెస్‌ను సాదాలె అని వ్యాఖ్యానించాడు. తెలంగాణ దిల్లీ కాంగ్రెస్ ను సాదాలంటే గల్లీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని బాదాలి. ఇదే నడుస్తున్నది. ఈ మధ్య కప్పం దిల్లీకి తీసుకుపోయే వైశ్రాయిని కూడా మార్చారు.
ఎస్ఎల్‌బిసి ఘటన బాధాకరం
ఎస్ఎల్బీసీ ఘటన చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 8 మంది కార్మికుల గురించి వారి కుటుంబాల గురించి ఆలోచిస్తే చాలా ఆవేదన కలుగుతున్నదని అన్నారు. దీని మీద కూడా కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయ వ్యాఖ్యలు చేయడం మనస్తాపం కల్గించింది. ఘటన జరిగిన తర్వాత మేం చాల సమన్వయంగా వ్యవహరించాం. కానీ కాంగ్రెస్ నాయకులు వికృతమైన రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ మేం స్పందించక జవాబివ్వక తప్పని అనివార్యతను సృష్టించారు. పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని ఉత్తం కుమార్ రెడ్డి ఎలా అబద్దాలు చెబుతాడు. 2005 నుంచి 14 మధ్య కాంగ్రెస్ 3,300 కోట్లు ఖర్చు పెడితే, 2014 నుంచి 2023 మధ్య బిఆర్ఎస్ 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. అసెంబ్లీలో ఆనాడు జానా రెడ్డి కోరితే ఎస్ఎల్బిసి పనులు ప్రారంభించేందుకు 100 కోట్లు కేసీఆర్ ఇచ్చి జానారెడ్డి మాటలు గౌరవించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 230 కిలోమీటర్లు టన్నెల్ తవ్వి పూర్తి చేశామన్నారు. ఎస్ ఎల్ బి సి కింద రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు లో 90% శాతం పూర్తి చేశామన్నారు.
ఎల్లుండి ఉదయం ఎస్ ఎల్‌బిసీ టన్నెల్ ను సందర్శిస్తామని హరీష్ రావు తెలిపారు. సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని తాము వెళ్ళడం లేదని మేము వెళ్తుంటే పోలీసులు ఎటువంటి ఆటంకం కలిగించొద్దని కోరారు.