పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?

మాజీ మంత్రి హ‌రీష్ రావు

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి య‌త్నిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం సంద‌ర్శించింది. ఈ సందర్భంగా బాధితుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందానికి వ్యక్తం చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..పేదవాళ్ల రక్తం, కన్నీళ్ళ మీద మూసీ సుందరీకరణ చేస్తావా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని వదిలేసి మూసీ నది మీద పడి పేదల ఉసురు తీస్తున్నారని మండిప‌డ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా. ఎన్నికల్లో ఇవ్వని హామీ కోసం ఎందుకు కూల్చుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇందులో ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు గానీ.. పేదల బతుకులను కూల్చేందుకు 1.50ల‌క్ష‌ల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిల‌దీశారు. కెసిఆర్ 200 పెన్షన్ 2వేలు చేశాడ‌ని, రేవంత్ రెడ్డి 2వేల పెన్షన్ 4వేలు చేస్తాన‌ని ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమ‌ర్శించారు. కేసీఆర్ ఎన్నికల్లో చెప్పకున్నా కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో లక్షతో పాటు తులం బంగారం ఇస్తాన‌న్నాడు. రాపీ బంగారం లేదు.. లక్ష రూపాయలు లేవు. ఎవరి కోసం మూసి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నావు.? ఇందులో ఎవరెవరి హస్తముంది. కెసిఆర్ నిర్మించే కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడవదు అని ప్రచారం చేస్తున్నాడని, కానీ హైదరాబాద్ లో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూండా రాజ్ రాజ్యం తెచ్చాడని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాల‌ని సెటైర్ వేశారు. ఇక్కడ ఉండే ప్రజలు అన్ని రకాల టాక్స్ ల‌ను కడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో
నిర్మించుకున్న నిర్మాణాలే కదా. కేసు పెట్టేది ఉంటే ఏ ప్రభుత్వమైతే అనుమతులు ఇచ్చిందో వారి మీద కేసు పెట్టండి. మీరు ధైర్యంగా ఉండండి బుల్డోజర్ రావాల్సి వస్తే మమ్మల్ని దాటుకొని రావాలి అని అన్నారు. మీరు ఫోన్ చేస్తే అర్థగంటలో మీ ముందు ఉంటామ‌ని, బీఆర్ఎస్ పార్టీ మీకు కోర్టు ద్వారా న్యాయం చేయిస్తుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *