భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..
భద్రాచలంకు రాకపోకలు నిలిపివేత
తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. సోమవారం ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరుకుంది. దీనితో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. మొదటి ప్రమాద హెచ్చరిక మధ్యాహ్నం జారీ చేయగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అమ్రత్తం చేసారు. గోదావరి మరి కాస్త పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా మండలాల్లో ఉన్న అధికారులను కలెక్టర్‌ అ‌ప్రమత్తం చేసారు. ఇప్పటికే భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చర్ల వెళ్ళే రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ఆ రోడ్డును పోలీస్‌ అధికారులు బార్‌ ‌కేడ్స్‌తో నిలిపివేసారు. అలాగే వెంకటాపురం రహదారిపై కూడ గోదావరి వరదనీరు ప్రవహించడం వలన వెంకటాపురం , వాజేడు పేరూరు రాకపోకలు నిలిచిపోయాయి.

 

వెంకటాపురం వెళ్ళే ప్రజలు మణుగూరు మీదుగా ప్రయాణం చేయాలని పోలీస్‌ అధికారులు సూచించారు. అలాగే భద్రాచలం నుండి కూవనరం, విఆర్‌పురం, చింతూరు వెళ్ళే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుపై వరద ప్రవాహం వేగంగా ఉండటం వలన రహదారులను మూసివేసారు. గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయంకు 51 అడుగులు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ, సమ్మక్క, సారక్క, ఇంద్రావతి, ప్రాజెక్టుల నుండి వరదనీరు భద్రాచలం చేరుకుంటుంది. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగింది. అంతే కాకుండా చర్ల వద్ద ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వరదనీరు చేరుకోవడంతో ఆ నీటిని 24 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేసారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఏజన్సీ గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నుండి గోదావరి నీటిమట్టం కాస్త తగ్గముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *