- నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి సుద్దులు..
- నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టాడని విమర్శించారు. ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చాడు. తాము అధికారంలోకి వొస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇపుడు వేల కోట్ల విలువైన భూములను విక్రయించాలని చూస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను నీటి మూటలు చేస్తూ, నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుశేరుకు అమ్ముతుండటం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది. మాస్టర్ ప్లాన్ పేరిట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియమకానికి (ఆర్‌ఎఫ్ పి) గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడు తనానికి పరాకాష్ట. కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10వేల కోట్లు ఇప్పటికే సమీకరించింది. ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు రూ.30వేల కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు బ్యాంకులో తనఖా పెట్టడం, మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనం.
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధిని ఆధారాలతో సహా బయటపెట్టాను. జూన్ 26, 2024 నాడు విడుదల చేసిన జీవో ఎంఎస్ 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని నేను అసెంబ్లీలో నిలదీస్తే.. అలాంటిదేమీ లేదని, టీజీఐఐసీకి చేస్తున్న బూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి, సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీ అయ్యిందో, లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చుకున్నరు. మళ్లీ అసెంబ్లీ మొదలయ్యే లోపే ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని, ప్రతిష్టను బజారుకీడ్చారు మూసీ సుందరీకరణ, హైడ్రా అంటూ లేనిపోని భయాందోళనలు సృష్టించి హైదరాబాద్ బ్రాండ్ ను దెబ్బతీసారు. మీ 14నెలల పాలనలో తిరోగమనం బాట పట్టించారు.
ఒకవైపు తెలంగాణ దివాలా తీసిందంటూనే, మరోవైపు మీరు రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ (ఆర్ ఎఫ్ పి)లో ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్దిలో తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని, ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికం అని పేర్కొన్నారు. 2011-12 లో 3.6లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2020-21 నాటికి 11.5 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యధిక ఎకనమిక్ గ్రోత్ నమోదు చేసిందని స్పష్టంగా తెలిపారు. భూములు అమ్ముకోవడానికి డాక్యుమెంట్ల రూపంలో చెబుతున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను, బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి .. కేసీఆర్ చేసిన అభివృద్ధి మీరు ఎంత ప్రయత్నం చేసి దాచినా దాగదు. అసత్యాలు ప్రచారం చేయడం, ప్రతిపక్షాలను బుకాయించడం వంటివి ఇకనైనా మానుకోవాలని హరీష్ రావు హితువు పలికారు.