వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాలని వైద్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్ నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక సదుపాయాల నిర్వహణ, సాంకేతిక సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల నియమకంపై పూర్తిస్థాయి నివేదికను వివిధ విభాగాల హెచ్‌వోడీలు సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలోని అన్ని విభాగాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతంపై రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ల నిర్వహణ వ్యవస్థ బలోపేతం , ఎక్విప్మెంట్ ను పూర్తిస్థాయిలో వినియోగం, మౌలిక సదుపాయాల నిర్వహణ, రిపేర్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతంపై అన్ని విభాగాల హెచ్‌వోడీలతో క్షుణ్ణంగా ప్రతి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రవేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వాణి, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ కుమార్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.