రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల సన్నగిల్లిన విశ్వాసం పెంచడానికి తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థుల విద్య పట్ల తమ రాజకీయ సంకల్పాన్ని ధృవీకరించుకోవాలి.

జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్
తెలంగాణలో గ్రామ గ్రామాన పట్టణాలలో వివిధ బస్తిలలో విద్యకు రాబోయే బడ్జెట్ లో పెద్ద పీట వేయాలని గత నెల రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్య మంత్రి గారికి పోస్ట్ కార్డ్ ల రూపంలో సంతకాల సేకరణ ద్వారా ప్రజా అభిప్రాయాన్ని సమీకరిస్తున్నారు. మరో వైపు విద్యా ప్రేమికులు బుద్ది జీవులు, ప్రొఫెసర్లు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు, తల్లుల సంఘాలు మొదలగు వారు సభలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి ని ప్రత్యక్షంగా కలిసి విద్యా వ్యవస్థ మెరుగు పరచడానికి నిధులను పెంచ వలసిన ఆవశ్యకత నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15 శాతం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అన్నీ నివేదికలు విద్యకు రాష్ట్ర బడ్జెట్ లో 20 నుండి 30 శాతం అన్నారుగా మరి 15 శాతమే ఎందుకు డిమాండ్ చేస్తున్నారని కొందరి ప్రశ్న. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన ఎన్నికల ప్రణాళికలో అధికారంలోకి వస్తే బడ్జెట్ లో విద్యకు 15 శాతం కేటాయిస్తామని వాగ్దానం చేశారు కావున కనీసం వారు ప్రజలకు ఇచ్చిన హామీనైనా నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం.
అంపశయ్య మీద ప్రభుత్వ విద్య:
ప్రభుత్వ పెద్దలు విద్య మీద చేస్తున్న ప్రకటనలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంపశయ్య మీద ఉన్న విషయం కానీ సంక్షోభంలో ఉన్న విషయం కానీ విద్యా ఎమర్జెన్సీ లో ఉన్నట్లు రోజు రోజుకు ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతుందని కానీ పూర్తిగా అవగాహన ఉన్నట్లు కనిపించదు. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి 55 ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు ఒక్కో దానికి 200 కోట్ల చొప్పున 11,500 కోట్లు కేటా యిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విద్య మొత్తంగా కలిపి చూడకుండా బడుల పరిస్థితిని గమనించకుండా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న దశలో వాటిని సమగ్ర ప్రణాళికలు వేయకుండా ప్రజా ధనాన్ని అనాలోచితంగా ఖర్చు చేస్తున్న విధానం ఇది. ఈ విధానం నిర్మాణ సంస్థలకు లాభం చేకూరవచ్చు కానీ విద్యారులందరికి ఉపయోగ పడవని గమనించాలి.
అయినా విద్యార్థులకు విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలు ప్రత్యాన్మయం కాదని గుర్తించాలి. అవి కేవలం మొదటి తరం చదువుకు కదిలిన, నిర్లక్ష్యానికి గురి అయి, ఆదరణ కరువైన పిల్లలకే గురుకులాలు నిర్వహించాలి. అంతేకానీ రాష్ట్రంలోని ఉన్న 60 లక్షల మంది పిల్లలందరికి విద్యను అందించే సామర్ధ్యం కలిగి ఉండవని గమనించాలి. తమ ఆవాసాలల ప్రాంతాలలో విద్యను అందుకునే అవకాశాలు కల్పించాలి. అభివృద్ది చెందిన అన్నీ దేశాలలో అవాసాల పరిసరాలల లోనే విద్య అందుబాటులో ఉంటుంది. ఆ దేశాలల లాగా అభివృద్ది చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు వారి అభివృద్దికి 90 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యను అందించడం వల్లనే అని గమనించాలి.
ప్రైవేటు విద్య – కుటుంబాల పై ఆర్ధిక భారం :
ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతున్న దశలో ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు ముమ్మరంగా జరిగింది. పక్కనే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ అనుమతులను ప్రభుత్వమే ఇవ్వడం విచిత్రం. యుడైస్+ 23-24 సంవత్సరం గణాంకాలు చూస్తే కేవలం 29.83 లక్షల మంది విద్యార్థులకు కేవలం 10.54 లక్షల మంది(35%) మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ ప్రాథమిక (1-5తరగతులు) పాఠశాలలో చదువుతున్నారు, మిగిలిన 19,29 లక్షల (65%) మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువు ‘కొంటున్నారు’. అంటే గత ఐదు సంవత్సరాలలో అత్యధిక శాతం విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఇది పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాల పై ఆర్ధిక భారం పడుతుంది. ఇక పట్టణాలలో విపరీతంగా పెరుగుతున్న జనాభా అందుకు కనుగుణంగా నిధులను కేటాయించి ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయకపోవడం వలన హైదరాబాద్ లో 81%, మేడ్చల్ 85% ,రంగా రెడ్డి 70% శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వీరంతా ఆర్ధికంగా బలంగా ఉన్న కుటుంబాలు కావు.
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలకు ప్రైవేటు బడి ఫీజులు మరియు ఇతర ఖర్చులకు ఆర్ధిక ఇబ్బంది లేక పోవచ్చు. కానీ రోజు వారి కూలీలు,చిన్న వ్యవసాయ కుటుంబాల వారు ,కౌలు రైతులు , పట్టణాలలో పేద బస్తీ లలో నివసించే అసంఘటిత రంగ కార్మికులు,వంటరీ మహిళలు,గృహ కార్మికులు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల లలో ఉన్న అతి పేదలు తమ పిల్లలు తమ లాగా జీవనం సాగించ వద్దని తల తాకట్టు పెట్టి తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి మీద పేద వర్గాల కుటుంబాలు విద్య మీద పెడుతున్న ఖర్చు లెక్కేస్తే ప్రభుత్వ విద్యా బడ్జెట్ కన్నా అధికం గానే ఉంటుంది. దళితులు, ఆదివాసీలు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలక చెందినా బాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బాలలకు విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు. అమలు చేయడం ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత అని గుర్తించాలి.
2024-25 బడ్జెట్:
గత సంవత్సరం 2 లక్షల 91 వేల 191 రూపాయల బడ్జెట్ లో విద్యకు కేటాయించింది 21,292 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇది 7.3% శాతం మాత్రమే. ఇందులో పాఠశాల విద్యకు కేటాయించింది 17,942 వేల కోట్లు (6.2%) మాత్రమే. ఇన్ని వేల కోట్లు కేటాయించినట్లు కనిపించినా అందులో దాదాపు 15 వేల కోట్లు సిబ్బంది జీతాలకే ఖర్చు అవుతున్నాయి. ఇక మౌలిక సదుపాయాల కల్పనకు ,పర్యవేక్షణకు, పాఠశాలలో విన్నూతన ప్రయోగాలకు, పోటీ ప్రపంచంలో ఎదురుకునేందుకు కావలసిన కంప్యూటర్ లకు కృత్రిమ మేధో పాఠ్యాంశాల బోధనకు సరిపడా నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది.
టీచర్లకు బోధనేతర పనులు -పర్యవేక్షణ అధికారుల ఖాలీలు:
సరే ఇన్ని వేల కోట్ల జీతాలు చెల్లిస్తున్న ఉపాధ్యాయులతో కేవలం బోధననే చేయించు చున్నార అంటే అది లేదు. టీచర్లకు పలు బోధనేతర పనులు అప్పగించి జవాబుదారీ తనాన్ని రాజీ పడుతున్నారు. ఇక పర్యవేక్షణ అధికారుల నియామకం సంవత్సరాల తరబడి లేదు. ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను బోధన పని నుండి తప్పించి పర్యవేక్షణ అధికారిగా అదనపు డ్యూటీ వేశారు. పదవి విరమణ పొందిన టీచర్ల స్థానంలో మరో టీచర్ రావడంలో జాప్యం, వెనుక బడిన ప్రాంతాలలో ఉపాధ్యాయుల కొరత, గ్రామంలో ఉన్న విద్యార్థులకు అనుగుణంగా టీచర్లను నియమించక పోవడం. ప్రభుత్వం తమ పిల్లలకు చదువు చెప్ప దలచుకోవడం లేదనే అభిప్రాయానికి రావడం పెద్ద కష్టం కాలేదు సమాజానికి. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు ప్రభుత్వ విద్య పతనానికి కావలసిన బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఒక వైపు అయితే విద్యా వ్యవస్థ నిర్వహణను గాలికొదిలి వేయడం మరో కారణం.
విద్యా విధానాలు: నూతన అసమానతలు:
సమాజంలో ఉన్న అసమానతల ప్రతిబింబమే మన విద్యా విధానం. గురుకుల స్కూళ్ళు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు,కేంద్రీయ విద్యాలయాలు,నవోదయ విద్యాలయాలు ఆ పై పిండి కొద్ది రొట్టె లాగా ప్రైవేటు స్కూళ్ళు. సామాజక అసమానతలను అధిగమించడానికి విద్య ఒక ఆయుధంగా వాడే బదులు ప్రభుత్వ విద్య మీద తగినన్ని నిధులు ఖర్చు చేసి అన్నీ వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలలో చదవాలనే నియమాలను ఏర్పాటు చేసి సమాజం లోని అసమానతలను దూరం చేయకుండా ఉన్న అసమానలతో పాటు నూతన అసమానతలను ప్రభుత్వ విద్యా విధానలే కారణం అవుతున్నాయి. ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య.
చివరగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల సన్నగిల్లిన విశ్వాసం పెంచడానికి తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థుల విద్య పట్ల తమ రాజకీయ సంకల్పాన్ని ధృవీకరించుకోవాలి.