- ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు
- రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు
- భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు
- జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు
- కోల్ బెల్టులో ఆందోళన
- 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు
మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7.25 నిముషాల నుంచి 7.45 నిముషాల వరకు రెండు సార్లు భూమి కంపించింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏటూరు నాగారం సమీపంలో సుమారు భూమికి 10కి.మీ లోతులో భూ భ్రంశాల్లో స్థాన చలనం జరగటం వల్లే ఈ భూకంపం సంభవించినట్లు శ్రాస్త్రవేత్తలు తెలిపారు. భూమి లోపల భ్రంశాలు రెండు ఖండాలుగా విడిపోవటంతోనే ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. ములుగు జిల్లా నుంచి సుమారు 200కి.మీ నుంచి 300కి.మీ రేడియస్ లో ఈ ప్రకంపనాలు విస్తరించినట్లు సీఎస్ఏఆర్ ఎంజీఆర్ఐ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ ప్రకంపనాలు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 నుంచి 7 సెకండ్ల వరకు రెండు మార్లు సంభవించినట్లు ఎంజీఆర్ఐ తెలిపింది.
జోన్ 2, 3లో అత్యధికంగా కంపనాలు..
రిక్టరు స్కేలుపై 5.3తీవ్రత నమోదైనట్లు ఈ భూ కంపం తీవ్రత జోన్ 3పై అధికంగా ఉండగా, జోన్ 2లో స్వల్పంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో భూకంపనాలు సంభవించాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోను చాలా చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. అల్లూరి జిల్లా, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, జగ్గయ్యపేట, నందిగామ, గుడివాడ, మచిలీపట్నం, మంగళగిరి, ఏలూరు తదితర ప్రాంతాల్లో సుమారు 6 సెకండ్ల పాటు భూమి కనిపించింది. జోన్ 2 అతి తక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతం. జోన్ 2 లో ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్వల్పంగా భూమి కనిపించింది.
కోల్ బెల్ట్ లో టెన్షన్ టెన్షన్..
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం సమీపంలో సుమారు 10కి.మీ లోతులో భూమిలో కదలికలు ఉన్నట్టు దీనివల్లనే తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనులు సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, కోల్ బెల్ట్ ఉండటంతో భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, ములుగు, బయ్యారం తదితర ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా ఇండ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. చాలా చోట్ల ఇండ్లకు, రేకుల కప్పులకు పగుళ్లు రాగా, పలు చోట్ల గోడలు కూలాయి. భూకంప తీవ్రత సీసీ టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించటంతో ఎపుడు ఏంజరుగుతుందో అని ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయాందోళన చెందారు.
ములుగులో వరుస ప్రకృతి వైపరిత్యాలు..
ఈ ఏడాది సెప్టెంబర్ 4న ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో స్క్వా మాస్ ఫార్మేషన్ వల్ల 12కి.మీ మేర 50వేలకు పైగా చెట్లు నెలకొరగటం జరిగింది. జీయాలాజికల్ శ్రాస్త్రవేత్తలు అనంతరం బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్లే చెట్లు నెలకొరిగినట్లు తెలిపారు. మళ్లీ అదే ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతం నుంచి భూకంపం రావడంతో ములుగులో ఏం జరుగుతుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గోదావరి బేసిన్, కోల్ బెల్ట్ ఏరియా కావటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
55ఏళ్ల తర్వాత ఆ స్థాయి భూకంపం..
బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన భూకంపం తీవ్రత 55ఏళ్ల క్రితం నమోదైన తీవ్రతను సమం చేసింది. సరిగ్గా 55ఏళ్ల క్రితం 1969 జూన్ 13న గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. మళ్లీ అదే స్థాయిలో బుదవారం భూ ప్రకంపనాలు తెలుగు రాష్ట్రాల్లో సంభవించాయి. అయితే దక్షిణ భారతదేశంలో 1993లో మహారాష్ట్రలోని లాతూరులో 6.3గా నమోదైంది. అదే విధంగా 2021లోనూ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పులిచింతల సమీపంలో భూకంపం రాగా రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. జీయాలాజికల్ సర్వే ఇండియా ప్రకారం రాతిపోరల్లో ఎలాంటి కదలికలు ఉన్నాయన్నది తెలుసుకోవాటానికి తెలంగాణలోని హైదరాబాద్ లో సైస్మిక్ పరికరాలు అమర్చటం జరిగింది. 1969 నుంచి వీటి ద్వారా భూమి పొరల్లో ఎలాంటి కదలికలు జరిగిన వెంటనే గుర్తించి కేంద్రానికి తెలియజేయటం జరుగుతోంది.
భయాందోళన అవసరం లేదు..
భూకంప కేంద్రం ఏటూరు నాగారం ప్రాంతంలో మొదలై తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుంటాయని నేషనల్ జీయాలజికల్ సర్వేలో గతంలోనే వెల్లడైంది. భూమి పొరల్లో ఉన్న రాతి పోరలను అనుసరించి జోన్ లను కేటాయించటం జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు జోన్ 3లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూమి పొరల్లో కదలికలు తరచూ జరుగతుంటాయి, ఆ సమయంలో ప్రకంపనాలు జరుగుతాయి. కాగా బుధవారం భూ కంపం తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే సంబంధించి ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూమిలోపల ఉన్న మూడు రకాల భ్రంశాల్లో స్థాన చలనాలు సంభవించినపుడు ఇలాంటి కంపనాలు సంభవిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. మైనింగ్ కు భూ కంపానికి ఎలాంటి సబంధం ఉండదని శ్రాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గతంలో జరిగిన పరిణామానికి ఈ భూ కంపానికి ఎటువంటి సంబంధంలేదని సైస్మాలజిస్టులు స్పష్టం చేశారు.