రేవంత్‌రెడ్డి పాలనపై బిజెపి, బిఆర్‌ఎస్ ఛార్జిషీటు
( మండువ రవీందర్‌రావు )
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవా’లను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండగా, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ‘ఛార్జిషీటు’పేరున తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదికాలంలో వాటిని నిలుపుకోలేకపోయిందంటూ ఎదురుదాడి కొనసాగిస్తున్నాయి. ఒక పక్క గత ప్రభుత్వం అర్థంలేని పథకాలు చేపట్టి అడ్డగోలుగా ప్రజాధనం వ్యయంచేసిందని, ఆ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలపేర ప్రజాధనాన్ని మరింతగా దుర్వినియోగం చేయడాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. గత పాలకుల తీరుపై ధ్వజమెత్తిన కాంగ్రెస్, పాలనావిధానంలో మార్పురావాలంటూ ఘోషించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఏం సాధించారని ఉత్సవాలకు కోట్లాది రూపాయలు వ్యయంచేస్తున్నారని, మార్పు అంటే ఇదేనా అంటూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీని ముఖ్యంగా సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీస్తున్నారు.

ఏడాది క్రితం ప్రభుత్వానికి రాకముందు ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలుచేసి చూపిస్తామని ప్రజలను నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి ఏడాది కావొస్తున్నా వాటిని పూర్తిచేయకపోడమే ఆ పార్టీ చెప్పుకునే పెద్ద మార్పా అని ఆయన ఎద్దేవచేశారు. ఈ విషయంపై తాజాగా చార్జిషీట్‌ను విడుదలచేసిన బిజెపి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను నిలదీసింది . ఈ ఏడాది కాలంలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా 46వేల కోట్లను అప్పు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత భ్రష్టు పట్టించిందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ వ్యక్తం చేసింది. తామిచ్చిన హామీలన్నిటినీ దాదాపు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ గతంలో అందిస్తున్న రెండువేల రూపాయల పించన్‌కన్నా ఎక్కువగా నాలుగువేల పించన్‌ను చేయూత పథకం కింద అందిస్తామన్న వాగ్ధానాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలంటోంది బిజెపి.
మహిళలకు ఉచిత బస్సుపేర ఆడబిడ్డలకు కోట్లాదిరూపాయలను లాభం చేశామంటున్న కాంగ్రెస్ ఉన్న బస్సులను ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలంటున్నది. ఈ మహిళలకే ఇస్తామన్న 2500 రూపాయలేమైనాయి, పుట్టిన బిడ్డకు బంగారు లక్ష్మీ పథకం ఏమైంది, ఏటా 20 కోట్లు కేటాయిస్తామన్న బీసీ సంక్షేమం ఎటు పోయింది, విద్యా భరోసా కింద ఇస్తామన్న అయిదు లక్షలకు సంబందించిన బ్యాంకు కార్డులు ఇంకెప్పుడంటూ ఆ పార్టీ నిలదీస్తున్నది. వీటిపై ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న బిజెపి, ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ మూసీని ముందుకు తీసుకువొచ్చిందని ఆరోపిస్తున్నది. కాళేశ్వరంపేర బిఆర్‌ఎస్ లక్షకోట్లు దోపిడిచేస్తే, ఇప్పుడు మూసీ పేర కాంగ్రెస్ లక్షన్నర కోట్లకు ఎసరుపెట్టిందని ఆపార్టీ ధ్వజమెత్తుతోంది. కాగా డిసెంబర్ ఏడవతేదీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకివొచ్చి సరిగ్గా ఏడాది కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన పాలనా వైఫల్యాలను వివరిస్తూ ఆదేరోజున రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున బహిరంగసభను నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేసీ నడ్డా తదితరులు ఆహ్వానించనుంది. ఈ విషయంలో ఇప్పటికే ఈనెల ఒకటవ తేదీనుంచి అయిదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఆ పార్టీ చేపట్టిన విషయం తెలిసిందే.
భారత రాష్ట్ర సమితి కూడా అదే రోజున రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ‘చార్జిషీట్’ను విడుదలచేయబోతున్నది. ఆరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలముందు పెట్టేందుకు ఆ పార్టీ సిద్దమైంది. రేవంత్‌రెడ్డికి పాలన చాతగాక రోజుకోమాట చెబుతూ ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని ఆపార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు , అణచివేతలు, లాఠీచార్జీలకు పాల్పడుతున్నది. అందుకు తాజాగా జరిగిన లగిచర్ల సంఘటనను వారు ఉదాహరిస్తున్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరిట ప్రజాస్వామ్య హవనానికి ఒడిగట్టిందంటూ ఆ పార్టీ ముఖ్యనేతలు హరీష్‌రావు, కెటిఆర్‌లు కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.
కాగా విపక్షాల విమర్శలను విజయోత్సవాల సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తిప్పికొడుతున్నారు . విపక్షాల విమర్శలను ఆయన సంక్రాతి సందర్భంగా వొచ్చే గంగిరెద్దుల మేళాలతో పోల్చారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయంటూ ఆ పక్షాలను ఏకిపారేశారు. ముఖ్యంగా గంగిరెద్దులవాళ్ళు జోలె పట్టుకొచ్చి, అది నిండగానే వెళ్ళిపోయినట్లు సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వోట్లకోసం పార్టీలు వొస్తున్నాయని, వొట్లు పడగానే అవి వెళ్ళిపోతాయని, ఆలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గడచిన పదేళ్ళకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్, పదకొండు ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి చేసిందేమన్నది ప్రజలు అర్థంచేసుకోవాలంటున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ప్రజలకు గుర్తుచేస్తున్నారు. తమ పాలనలో ప్రపంచ వ్యాపార పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయంటూ, ఈ ఏడాదికాలంలో ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యారంగంలో తాము సాధించిన ప్రగతిని రేవంత్‌రెడ్డి విజయోత్సవసభల్లో వివరించే ప్రయత్నం చేస్తున్నారు.