ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక పోయారు. అశక్తులుగా..నిస్సాహాయతను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులే కాదు…రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కూడా చెట్టులెత్తేసారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు కలిగించిన శబ్ద కాలుష్యం..అసౌకర్యం పై సామాజిక మాధ్యమాల్లో బాధితులు వ్యక్తం చేసిన పోస్టు లపై పోలీస్ ప్రతిస్పందన నిరాశాజనకం…గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు అర్ధరాత్రి వరకు నిర్వహించిన అసాంఘిక పనులు, అశ్లీల పాటలు అసలైన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి. పాకిస్తాన్ లో కూడా గుర్తుంచుకోని ఆ దేశ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పైన పాటలు…40సంలుగా మారుమోగుతున్న అమితాబ్ బచ్చన్ డాన్ పాటలు.. ఈ మధ్య కాలంలో యువత చిందులేస్తున్న ఉ అంటావా మామ నటి సమంత పాటలతో మండపాల వద్ద డిజే ల మోత నివాసితులను తీవ్ర అసౌకార్యానికి గురిచేసాయి.

బాధ్యత గల పౌరులు కలుగుతున్న అసౌకర్యాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసు ల దృష్టికి తెస్తే “ పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి? ! నిర్వాహకులకు నిరంతర కౌన్సెలింగ్ చేసినా కూడా ఉపయోగం ఉండడం లేదు..ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా కార్యక్రమాలు నిర్బహించు కోవాలి అన్నది సామాజిక బాధ్యత వారి లోపలి నుండి రావాలని మీరు అంగీకరించరా..? మేము..పోలీస్… కొంచెం కఠినమైన చర్యలను ఉపయోగిస్తే, అది వెంటనే హిందూ, ముస్లిం వ్యతిరేక వంటి ముద్ర వేయబడుతుంది మరియు మేము ఆత్మరక్షణ లో పడుతున్నాం..” అని ఘనత వహించిన మన పోలీసు బాసు సమాధానం..! గణేష్ నవరాత్రుల హంగామా అట్లా ఉంటే మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు చాలా ప్రశాంత వాతావరణం లో జరిగినందుకు పోలీస్ బాస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవ ఊరేగింపు డిజే లతో నిర్వహించడం కూడా పలు విమర్శలకు దారి తీసింది.అదే మతానికి చెందిన ఒక వర్గం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖండించింది.

మిలాద్ ఉన్ నబీ సందర్బంగా డీజే లతో ర్యాలీ లు నిర్వహించడం ఇస్లామ్ కు విరుద్ధమని ఎంబీటీ అధికార ప్రతినిధి ,మాజీ ఎమ్మెల్యే అంజదుల్లా ఖాన్ అన్నారు . డీజే లతో నిర్వహించిన ర్యాలీ ని నివారించలేక పోవడం పై ఆయన పోలీస్ అధికారులను తప్పుబట్టారు. మతం ఏదైనా ..పండుగలు ఏవయినా భక్తి శ్రద్దలతో ..ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలి …పొరుగు వారికి అసౌకర్యం కలుగొద్దు అన్న సామాజిక బాధ్యత ప్రతి పౌరుడికీ ఉండాల్సిందే ..ఆ బాధ్యత ను పోలీసుల తో పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదు ..కానీ ..పండుగల నిర్వహణలో రాజకీయాలు ప్రవేశించినప్పుడు శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందన్న కనీస అవగాహన పోలీసులకు ఉండాలి ..సామాజిక బాధ్యత గుర్తించి నిర్వాహకులకు అక్కడి నివాసితులు తమ బాధను , అసౌకర్యాన్ని వివరించబోతే వారు ఎదుర్కొంటున్న బెదిరింపులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ‘ ఏం చేస్తాం ..ప్రజల పాలన ..’ అని బాధ్యతారహిత సమాధానం సమంజసమేనా ..?

ఒక వైపు ర్యాలీ లలో డీజే లకు అనుమతి లేదు అంటూనే ఆ ర్యాలీ వెంబడి భద్రతా కల్పిస్తూ పోవడం పోలీసుల కర్తవ్య నిర్వహణలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోక పోవడం పోలీసుల ఉదాసీనత వైఖరికి నిదర్శనం.. గత 12 రోజులు హైదరాబాద్ నగర పౌరులను తీవ్ర అసౌకర్యానికి ..మానసిక క్షోభ కు గురిచేసిన పరిస్థితులను గుర్తించకుండా ..నగర పోలీస్ కమిషనర్ విధి నిర్వహణలో పోలీసులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ ఎట్టకేలకు రెండు పండుగలు భారీ ఊరేగింపులతో ప్రశాంతంగా ముగిసాయి, చివరికి హైదరాబాద్ నగర సమ్మిళిత సంస్కృతి, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఒకరికొకరు డీజే లను ఉపయోగించడంలో దూకుడు ప్రదర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో గత 15 రోజులుగా పోలీసులు మరియు ఇతర శాఖలకు సహకరించిన హైదరాబాద్ ప్రజలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం సిటీ పోలీస్ ఫోర్స్ మరియు అధికారులు అలసిపోయారు వారికి కొంత విశ్రాంతి అవసరం..’ అని ట్వీట్ చేయడం సమంజసమేనా ..?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page