పొదుపు గందగోళం

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక విచిత్రమైన ద్వంద్వ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటి అంశాలు దేశాన్ని మితవ్యయ విధానాల వైపు నెడుతుంటే, మరోవైపు వినియోగ వ్యయం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేయ్నార్డ్ కేన్స్ ప్రతిపాదించిన “Paradox of Thrift” లేదా “పొదుపు గందరగోళం ” మళ్లీ ప్రాసంగికమవుతోంది.

కేన్స్ అభిప్రాయం ప్రకారం, వ్యక్తిగత స్థాయిలో పొదుపు మంచి అలవాటు కావొచ్చు. కానీ సమాజం మొత్తంగా ఒకేసారి ఖర్చులను తగ్గిస్తే, వ్యాపారాల ఆదాయం పడిపోతుంది. దాంతో ఉత్పత్తి తగ్గుతుంది, ఉద్యోగాలు తగ్గుతాయి, ఆదాయం తగ్గుతుంది. చివరికి ప్రజలు మరింత పొదుపు చేయలేని పరిస్థితి వొస్తుంది. అంటే, అందరూ ఒకేసారి పొదుపు చేయాలని ప్రయత్నించడం ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతుంది. దీనినే “పొదుపు గందరగోళం ” అంటారు.

ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం, ప్రధానమంత్రి స్థాయిలోనూ “ఇంధన పొదుపు”, “వర్క్ ఫ్రమ్ హోమ్”, “విదేశీ ప్రయాణాల నియంత్రణ”, “బంగారం కొనుగోలు తగ్గింపు”, “వంటనూనె వినియోగం తగ్గించుకోవడం” వంటి సూచనలు వెలువడుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి, దిగుమతుల వ్యయం పెరగడం, చమురు ధరల పెరుగుదల వంటి పరిస్థితుల్లో ఇవి తాత్కాలికంగా సమంజసమైన సూచనలే. ఎందుకంటే దేశం అధికంగా దిగుమతులపై ఆధారపడే వస్తువుల వినియోగం తగ్గితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గవొచ్చు.

అయితే సమస్య ఇక్కడితో ఆగదు. ఈ మితవ్యయ భావన సమాజం మొత్తం వినియోగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తే, పరిస్థితి ప్రమాదకర దిశలోకి వెళ్లే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే డిమాండ్ సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. వేతన జీవుల నిజమైన ఆదాయాలు పెరగడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు అప్పులు, విద్యా ఖర్చులు, వైద్య ఖర్చుల ఒత్తిడితో కృంగిపోతున్నాయి. చిన్న వ్యాపారాలు, రిటైల్ రంగం, వినియోగదారులపై ఆధారపడే పరిశ్రమలు మార్కెట్ విస్తరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అసలు సమస్య సరఫరాలో కాదు, కొనుగోలు శక్తిలో ఉంది. ప్రజల చేతిలో డబ్బు లేకపోతే మార్కెట్ ఎలా కదులుతుంది? వస్తువులు తయారుచేసినా కొనేవారు లేకపోతే పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగాలు తగ్గుతాయి. ఉద్యోగాలు తగ్గితే వినియోగం మరింత క్షీణిస్తుంది. ఈ చక్రం చివరకు ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది.

గత ఏడాది జీఎస్టీ సడలింపులు, బ్యాంకుల రుణ సౌకర్యాలు కొంతవరకు పెద్ద కొనుగోళ్లను ప్రోత్సహించాయి. వాహనాలు, గృహోపకరణాలు వంటి రంగాల్లో కొంత కదలిక కనిపించింది. కానీ అది విస్తృత ప్రజావర్గాలకు చేరలేదు. గ్రామీణ భారతంలో వినియోగం ఇంకా బలహీనంగానే ఉంది. రైతుల ఆదాయాలు స్థిరంగా లేవు. పట్టణాల్లో ఉద్యోగ భద్రత తగ్గుతోంది. ఐటీ, స్టార్టప్ రంగాల్లోనూ అనిశ్చితి పెరుగుతోంది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవాలని ప్రజలకు వరుసగా పిలుపునిస్తే, అది మానసికంగా కూడా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రజలు “రాబోయే రోజులు కష్టమేమో” అనే భయంతో అవసరమైన కొనుగోళ్లు కూడా వాయిదా వేయడం ప్రారంభిస్తారు. దీని ప్రభావం చిన్న వ్యాపారాలపై తీవ్రంగా పడుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రిటైల్ రంగం, చిన్న మధ్యతరహా వ్యాపారాల పాత్ర అత్యంత కీలకం. ఇవే కోట్లాది ఉద్యోగాలకు ఆధారం.

అంతేకాదు, అధిక పొదుపు అనే భావన సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదమూ ఉంది. ధనిక వర్గాలు పొదుపు చేయగలుగుతాయి. కానీ ఇప్పటికే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వర్గాలు ఖర్చు తగ్గిస్తే వారి జీవన ప్రమాణాలే దెబ్బతింటాయి. పోషకాహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాల పైనా ప్రభావం పడుతుంది.

కేన్స్ చెప్పిన సిద్ధాంతం నేటి భారతదేశానికి పూర్తిగా సరిపోతుందా అంటే, పరిస్థితి మిశ్రమంగా ఉంది. ప్రస్తుతం సమస్య కొంతవరకు సరఫరా సంక్షోభమే. చమురు, దిగుమతులు, గ్లోబల్ సరఫరా గొలుసుల అంతరాయం వంటి అంశాలు నిజంగానే ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే అదే సమయంలో దేశీయ డిమాండ్ బలహీనత కూడా తీవ్రమైన సమస్యగా మారుతోంది. అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా సమతుల్యత పాటించాలి.

విదేశీ మారక నిల్వలను కాపాడే చర్యలు అవసరమే. కానీ అవి వినియోగ వ్యవస్థను దెబ్బతీయకుండా ఉండాలి. ప్రజల్లో భయ వాతావరణం సృష్టించేలా కాకుండా, ఉత్పాదక పెట్టుబడులు, ఉద్యోగ సృష్టి, గ్రామీణ కొనుగోలు శక్తి పెంపు, మధ్యతరగతి ఆదాయ భద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ “పొదుపు గందరగోళం ” అనే కేన్స్ హెచ్చరించిన ఉచ్చులో పడే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *