- భట్టి నేను జోడెడ్ల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం
- ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ‘మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్బుతంగా ఉంది’ అని, ‘మేమిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy ) అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
మా మిత్రులు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదం లాగా షడ్రుచులతో ఉన్నదని వర్ణించారు. తీపి, పులుపు, కారం కాస్త కూసో ఉప్పు కూడా ఉంది. ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ మరికొన్ని అంశాల్లో వారు చాలా లిబరల్ గా ముందుకు వొచ్చారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యం, పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. నేను, మా ఉప ముఖ్యమంత్రి జోడెడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తాం‘ అని తెలిపారు.