టెన్త్ ఫలితాల్లో ములుగు అగ్రస్థానం

– మంత్రి సీతక్క హర్షం
– జిల్లా యంత్రాంగానికి, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన గురువులకు, అలాగే పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన అప్పటి జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. ఇది జిల్లాస్థాయిలో సమన్వయంతో చేసిన కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15 శాతంగా నమోదు కావడం సంతోషకరమని తెలిపారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో ఉండగా బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. సంక్షేమ పాఠశాలల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదవడం ప్రభుత్వ పథకాల ఫలితమని తెలిపారు. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *