– జీసీసీలను జీవీసీలుగా మార్చేలా రోడ్డు మ్యాప్
– రెడీ టు వర్క్‌ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి
– ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం కాకుండా స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టటు కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ కేవలం ఐటీ డెస్టినేషన్‌గా కాక ప్రపంచశ్రేణి వ్యాపార పరిష్కారాలకూ చిరునామాగా మారుతోందన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతున్నదన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా రెడీ టు వర్క్ ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాక గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్‌గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికిపైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,600కు చేరుకుంటుందన్నారు. హైనెకెన్ స్ఫూర్తితో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్‌వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హై²నెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




