అత్యాధునిక హంగులతో  చర్లపల్లి రైల్వే స్టేషన్

త్వరలో అందుబాటులోకి రానున్నది 

పనుల పురోగతి పర్యవేక్షించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం  తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఊపారు .  ఆదివారం మంత్రి జి.కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి జరిగిన పనులపై అధికారులతో ఆరా తీశారు. స్టేషన్ మొత్తం కలియదిరిగి ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా ఏ మేరకు జరగాల్సి ఉంది? అనే విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చరపల్లి టెర్మినల్ పునర్ నిర్మాణానికి రూ. 430 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రస్తుతం 98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. వొచ్చె నెలాఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువొస్తామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని  మౌలిక వసతుల అభివృద్ధి  పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ రహదారులు, విశ్వవిద్యాలయాలు, అత్యంత వేగవంతంగా రైల్వేల అభివృద్ధిని చేపడుతుందన్నారు.  అన్ని రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిలో మూడు మేజర్ టెర్మినల్ లు ఉన్నాయన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టెర్మినల్ లకు అదనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి రాబోతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ టెర్మినల్ అందుబాటులో వొస్తే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పై భారం తగ్గుతుందన్నారు. ఓఆర్ ఆర్ ద్వారా చర్లపల్లికి త్వరగా చేరుకోవొచ్చన్నవారు. . ఒక నెలలోనే మిగతా పనులు పూర్తి చేసి ప్రయాణికులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నామన్నారు. ఈ డ్యూయల్ రైల్వే టెర్మినల్ కు రూ. 430 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. ఇక్కడ 20 రైళ్లు ఆగుతాయన్నారు. హైదరాబాద్ కు వొచ్చే గూడ్స్ రైళ్లు కూడా చర్లపల్లిలో ఆగుతాయన్నారు. ఇక్కడి నుంచే అన్ లోడ్, పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి స్టేషన్ ను పూర్తి అత్యాధునిక హంగులతో నిర్మాణం చేశామన్నారు. వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, దివ్యాంగులు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక్కడి నుంచి నగరానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డును రాష్ట్ర  ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.. భరత్ నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, మహాలక్ష్మి వైపు 80 అడుగుల రోడ్డు, ఇండ్రస్టీయల్ వైపు 100 ఫీట్ల రోడ్లు ఉండాలని కోరినట్లు తెలిపారు. త్వరలో ఈ కనెక్టివిటీని రాష్ట్ర  ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగవంతంగా ఆయా పనులు చేస్తామని తమకు తెలిపిందన్నారు. మరోసారి ఈ పనుల కోసం మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కనెక్టివిటీ సులువైతేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. త్వరలోనే రైల్వే, ప్రభుత్వ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో పర్యావరణ హిత చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వ్యవస్థను పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని సక్సెస్ ఫుల్ గా వాటి ఫలితాలు వొస్తున్నాయని తెలిపారు. .

సికింద్రాబాద్ నుంచే ఐదు వందేభారత్ ట్రైన్లు వొస్తాయన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామన్నారు. ఈ రకమైన రైళ్లలో స్లీపర్ కోచ్ లను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్కృతికి ప్రతిబింబించేలా ఆధునికతతో కూడుకున్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రూ. 715 కోట్లు, నాంపల్లి రూ. 429 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆ పనులను పరిశీలిస్తానని అన్నారు. దక్షిణ భారత్ లో ఆధునిక సాంకేతికత, వసతులతో కూడిన రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ నిలవబోతుందని డిసెంబర్ 2025లోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని అన్నారు. సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మాదిరిగా రూపొందుతుందన్నారు. నాంపల్లి పనులపై టెండర్లు పూర్తవుతాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇక్కడ రైల్వే వ్యాగన్స్ ఇక్కడే తయారవుతాయన్నారు. 369 కి.మీ. సింగిల్, డబ్లింగ్, ట్రిపులింగ్ లు చేపట్టామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు.

భక్తులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లి మల్లన్నకు కూడా రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ప్రమాదకరంగా ఉండకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 268 ఆర్ యూబీలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, 42 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తెలంగాణలో 176 రైల్వే స్టేషన్ లలో హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించామని అన్నారు. వివిధ రైల్వే స్టేషన్ లలో 86 స్టాల్స్ స్థానిక ఉత్పత్తులను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి లో సివరేజీ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. 500 చెట్లను రీ లొకేషన్ చేశామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 5వేల చెట్లను నాటాలని నిర్ణయించామన్నారు. గ్రీనరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ స్టేషన్లలో 3000 మొక్కలను నాటామన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఆధునిక పద్దతులతో ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ర్టిక్ చార్జీంగ్ 12 పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోలార్ పవర్ 110 కిలోవాట్స్ తో ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందశాతం సోలార్ పవార్ విద్యుత్ ను వినియోగించుకునే ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *