బయ్యారానికి మరోసారి బ్రేక్‌

కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్‌ ‌పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్‌ ‌తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ కర్మాగారాన్ని నెలకొల్పాలని తెలంగాణ వాదులు అనేక సంవత్సరాలుగా డిమాండ్‌ ‌చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచీ ఉన్న ఈ డిమాండ్‌ను విభజన అంశాల్లో కూడా పొందుపరిచారు. ఇందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతిచ్చాయి. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో కేంద్రం ఏమాత్రం అనుకూలించడంలేదు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, రాష్ట్రాల విభజనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు బయ్యారం ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వొచ్చినప్పుడల్లా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ డిమాండ్‌ను ముందుంచుతూ వొచ్చింది. కానీ మొదటి నుంచి తెలంగాణ పట్ల నరేంద్రమోదీ చిన్నచూపు చూస్తున్నారనేందుకు ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకపోవడమేనని బిఆర్‌ఎస్‌తో పాటు, తెలంగాణ వాదులు ఆరోపిస్తూనే ఉన్నారు. నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా, నేటి మహబూబాబాద్‌ ‌జిల్లాలోని బయ్యారంలో అపారమైన ఇనుప ఖనిజ సంపద ఉందన్న విషయాన్ని గతంలోనే జియాలజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా పేర్కొంది. జిల్లాలోని బయ్యారం, గార్ల, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం పరిధిలో దాదాపు 56వేల 960 హెక్టార్లలో ఖనిజ సంపద ఉందని, కనీసం వంద నుంచి 150 ఏండ్ల వరకు సరిపడా నాణ్యమైన ముడి ఇనుము ఇక్కడ లభ్యమవుతుందని చాలా కాలం క్రితమే ఆ సంస్థ చెప్పింది. అయితే కేంద్రంలోని నాటి కాంగ్రెస్‌, ‌నేటి బిజెపి ప్రభుత్వాలు ఈ విషయంలో అనేక సర్వేలు, నివేదికలంటూ దశాబ్దాల కాలంగా కాలక్షేపం చేస్తూ వొచ్చాయి.

ఎన్నికలు వొచ్చేసరికి బయ్యారం గురించి కేంద్రం ఆలోచిస్తున్నదన్న ప్రకటనలు చేస్తూ, ఆ తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ సాధ్యం కాదనడం ఆనవాయితీగా మారింది. వాస్తవంగా ఫ్యాక్టరీకి కావల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని స్థానిక నేతలు, ఉద్యమకారులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. బయ్యారం మండలంలో ఎంతలేదన్న నాలుగువేల ఎకరాల భూమి లభ్యమవుతుందని, కాని ఫ్యాక్టరీకి కావాల్సింది22 వందల ఎకరాలు మాత్రమేనంటున్నారు. ఆలాగే ఇక్కడ రైల్వే సదుపాయం ఉంది. త్వరలో మామునూరు, కొత్తగూడ విమానాశ్రయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. సమీపంలో ఉన్న సీతారామా ప్రాజెక్టు నుంచి కావల్సిన నీరు లభ్యమయ్యే అవకాశముంది. బూడిందపాడు వద్ద పవర్‌ ‌గ్రిడ్‌ ఉం‌ది. దానికి తగినట్లుగా కెటిపిసీ, బిటిపిఎస్‌ ఉం‌డనేఉంది. కాలుష్య నివారణకు పక్కనే అడవులున్నాయి. సమీపంలోని కారేపల్లి మండలంలో డోలమైట్‌ ‌లభ్యమవుతుంది. ఇక్కడి నుంచే విశాఖకు డోలమైట్‌ ‌వెళుతోంది. ఇన్నివసతులున్నా ఇక్కడి లభించే ముడి ఇనుము నాణ్యమైనది కాదన్న ఒక్కమాటతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొట్టిపారేయడమేంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నాణ్యమైన ముడిసరుకు తక్కువగా ఉన్నట్లు అయితే సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ ‌నుంచి ముడిసరుకును తెప్పించుకునే అవకాశముందంటూ ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి తెలిపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని విశాఖలో పెట్టారని, కేవలం నీటి వసతి తప్ప విశాఖకు చట్టుపక్కల ఇనుప గనులేవీ లేవని, అలాంటిది అన్ని వసతులున్నా ఇక్కడ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ విషయంలో నిర్ధిష్టమైన ప్రతిపాదనలు, నివేదికలను సమర్పించలేదంటూ గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపైన నిందలేసిన బిజేపి నేతలు, గత పదేండ్లుగా అధికారంలోఉండి కూడా ఫ్యాక్టరీ ఏర్పాటును పట్టించుకోకపోవడమంటే కేంద్రంతో పాటు స్థానిక నేతలకు చిత్తశుద్ధిలేదన్నది స్పష్టమవుతున్నదంటున్నారు తెలంగాణ వాదులు.

బిఆర్‌ఎస్‌ ‌నుంచి తీవ్ర విమర్శలు
దీనిపై బిఆర్‌ఎస్‌ ‌తీవ్రంగా స్పందించింది. రాష్ట్రానికి చెందినవాడైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో బయ్యారం సాధ్యంకాదని చెప్పినా, ఆయన్ను నిలదీయాల్సిందిపోయి, ముఖ్యమంత్రి కిషన్‌రెడ్డిని దిల్లీలో సన్మానించడాన్ని బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అభివృద్దిపట్ల బిజెపి రాష్ట్ర నాయకత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేందుకు ఇది నిదర్శనమని బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కవిత ఆరోపించారు. రాజ్యసభలో తెలంగాణ మినరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌ముడి ఇనుముల నిల్వల కేటాయింపుపై మాట్లాడిన కిషన్‌రెడ్డి బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌సాధ్యంకాదని చెప్పడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. లక్షా 41వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్‌ ‌టన్నులకు పైగా ఐరన్‌ ఓర్‌ ‌నిల్వలున్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, ముఖ్యంగా ఈ ప్రాంత గిరిజనుల అభివృద్దికి ఇది ఎంతో దోహదపడుతుందన్న స్థానిక ప్రజల ఆశలు దీంతో అడియాసలవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page