స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారు. ప్రభుత్వాలు చేసే చాలా ప్రకటనల్లోలాగే ఈ ప్రకటనల్లో కూడా అబద్ధాలుంటాయని అందరికీ తెలుసు. కాని ఈ ప్రకటనల నిజానిజాలు పరిశోధించి ప్రజలకు తెలియజెప్పే కథనాలు రాయవలసిన, ప్రసారం చేయవలసిన ప్రధాన స్రవంతి మీడియా ఆ పని చేయడం లేదు. ప్రధాన స్రవంతి ఆ పని చేయకపోయినా, సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రకటనల మీద విమర్శలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి సంబంధించినవారు ప్రభుత్వ ప్రకటనల మీద, కంపెనీల వివరాల మీద, అంకెల మీద వ్యాఖ్యానిస్తున్నారు. అవి పూర్తి విశ్లేషణలుగా కాక, ముఖ్యమంత్రి ప్రసంగాలలో కంపెనీల పేర్లు, కంపెనీల ప్రధాన అధికారుల పేర్లు తప్పు చెప్పారనే చిన్న విషయాలకే పరిమితమవుతున్నాయి. లేదా గత సంవత్సరపు ప్రకటనలు వాస్తవరూపం ధరించిన ఆధారాలు లేవని, ఎక్కడా శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగలేదని స్థూలమైన విమర్శలుగానే ఉన్నాయి.
అసలు దావోస్ సమావేశాల గురించి ప్రజల వైపు నుంచి లోతైన విమర్శ చేయవలసి ఉంది. ప్రకటనల్లో, అంకెల్లో డొల్లతనం, అవి సాకారం కాకపోవడం గురించి మాత్రమే కాదు, అసలు దావోస్ అభివృద్ధి నమూనా గురించి, అక్కడ సాగే బహుళ జాతి సంస్థల, ఎకనామిక్ హిట్ మెన్ ల ఆర్భాటాల గురించి, ప్రగల్భాల గురించి పరిశీలించవలసినదీ, ప్రజలకు చెప్పవలసినదీ చాలా ఉంది. దావోస్ సమావేశమే అతి పెద్ద ఎకనామిక్ హిట్ మాన్. అనేక మంది ఎకనామిక్ హిట్ మెన్ వేదిక. యూరపియన్ మేనేజిమెంట్ ఫోరం పేరుతో యూరఫ్ కు చెందిన కార్పొరేట్ల, బహుళజాతి సంస్థల చర్చావేదికగా 1971లో ప్రారంభమయిన ఈ సంస్థ, 1987 నుంచి తనను తాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పిలుచుకుంటున్నది. దేశాదేశాల సంపన్నులు, పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులు ఎక్కడెక్కడ తమ వ్యాపార అవకాశాలు, దోపిడీ అవకాశాలు ఉన్నాయో చర్చించుకునే వేదిక అది. వారి ముడుపుల కోసం వెంపరలాడే రాజకీయ నాయకులు, అధికారులు కూడా అక్కడికి వస్తారు. బందిపోటు దొంగల ముఠా గూడుపుఠాణీ సమావేశం అది. అక్కడికి వెళ్లడమూ, అక్కడ భారీ అంకెలు ప్రకటించడమూ గర్వకారణమేమీ కాదు. నిజం చెప్పాలంటే అది దేశద్రోహం, ప్రజా ద్రోహం. మన ప్రజల వనరులను, రక్తమాంసాలను, శ్రమను, సంపదను పళ్లెరాలలో పెట్టి అప్పగిస్తామని కార్పొరేట్లకు ఆహ్వానం పలికే వేదిక అది.
రాష్ట్ర విభజన తర్వాత గడిచిన పదకొండు సంవత్సరాలలో, తెలంగాణలో ముఖ్యమంత్రులైన ఇద్దరూ రాజకీయాలలో, ఆర్థిక అభివృద్ధి నమూనాలో చంద్రబాబు నాయుడు దగ్గర శిక్షణ పొందినవారూ, శిష్యరికం చేసినవారూ గనుక 2014 తర్వాత మళ్లీ హైదరాబాద్ దావోస్ ల మధ్య దూరం చాలా తగ్గిపోయింది. తెలంగాణ ప్రతినిధులు గడిచిన పదకొండు సంవత్సరాలలో కనీసం ఏడు సమావేశాలకు, గరిష్టంగా పది సమావేశాలకు వెళ్లారు. అట్లాగే మా ఊరి మిరియాలు తాటి కాయంత అని అసలు లేని దాన్నీ, ఇసుక రేణువంత ఉన్నదాన్నీ వందల రెట్లతో ఊదరకొట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యను ఇద్దరు శిష్యులూ పుణికి పుచ్చుకున్నారు.
అక్కడికి వెళ్లడం ఏదో గొప్ప మహత్కార్యమన్నట్టు, అక్కడ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటిని ఆర్భాటంగా ప్రకటించడం, ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రజా జీవనం ఎంతో అభివృద్ధి కానున్నట్టు ఆర్భాటపు ప్రకటనలు చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో ప్రారంభమయింది. 1995 సెప్టెంబర్ లో అధికారానికి వచ్చిన తర్వాత 1997 జనవరి నుంచీ ఆయన దావోస్ వెళుతూ వచ్చారు. ‘‘దేశంలోనే దావోస్ సమావేశాలకు వెళ్లిన మొదటి ముఖ్యమంత్రిని నేనే’’ అని కూడా ఆయన చెప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2003 వరకూ ఆయన కనీసం ఐదుసార్లు దావోస్ వెళ్లారనీ, ఈ పర్యటనల్లో దాదాపు ముప్పైవేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ప్రకటించారనీ సమాచారం.
చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తున్నానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుని, అధికారానికి వచ్చిన తర్వాత అదే అభివృద్ధి నమూనాను కొనసాగించిన రాజశేఖర రెడ్డి కూడా తన పాలనా కాలలో రెండు సార్లు దావోస్ వెళ్లారని, రెండుసార్లూ కలిసి దాదాపు యాబై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ప్రకటించారనీ సమాచారం. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ముఖ్యమంత్రిత్వ కాలంలో దావోస్ సమావేశాలకు వెళ్లినట్టు లేరు.
రాష్ట్ర విభజన తర్వాత గడిచిన పదకొండు సంవత్సరాలలో, తెలంగాణలో ముఖ్యమంత్రులైన ఇద్దరూ రాజకీయాలలో, ఆర్థిక అభివృద్ధి నమూనాలో చంద్రబాబు నాయుడు దగ్గర శిక్షణ పొందినవారూ, శిష్యరికం చేసినవారూ గనుక 2014 తర్వాత మళ్లీ హైదరాబాద్ దావోస్ ల మధ్య దూరం చాలా తగ్గిపోయింది. తెలంగాణ ప్రతినిధులు గడిచిన పదకొండు సంవత్సరాలలో కనీసం ఏడు సమావేశాలకు, గరిష్టంగా పది సమావేశాలకు వెళ్లారు. అట్లాగే మా ఊరి మిరియాలు తాటి కాయంత అని అసలు లేని దాన్నీ, ఇసుక రేణువంత ఉన్నదాన్నీ వందల రెట్లతో ఊదరకొట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యను ఇద్దరు శిష్యులూ పుణికి పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు దావోస్ వెళ్లారా లేదా కచ్చితమైన సమాచారం లేదు గాని ఆయన కొడుకు, పరిశ్రమల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె టి రామారావు 2018 నుంచి 2023 మధ్య కనీసం ఐదు సార్లు దావోస్ వెళ్లారని ఒక సమాచారం ఉంది. అంతకు ముందు మూడు సంవత్సరాలు కూడా ఆయన వెళ్లారని మరొక సమాచార వనరు చెపుతున్నది గాని అది సరైనదో కాదో తెలియదు. వీటిలో మొదటి మూడుసార్లలో ఒక లక్షా ఇరవై ఐదువేల కోట్ల రూపాయలు, 2022 లో రు. 42,000 కోట్లు, 2023 లో రు. 21,000 కోట్లు ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు.
ఆ తర్వాత అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా రెండు సార్లు దావోస్ వెళ్లి వచ్చి చేసిన పెట్టుబడుల ప్రకటనలు పైనే చూశాం. ఇక్కడి సమాచారంలో చాలా అంకెలను కచ్చితంగా ధృవీకరించుకోవాలంటే ఆయా సంవత్సరాల్లో దావోస్ వెళ్లి రాగానే ఆ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు చేసిన ప్రకటనలను పరిశీలించాలి. ప్రతి పెట్టుబడి ప్రకటనా వాస్తవరూపం ధరించిందో లేదో ఆయా సంవత్సరాల ప్రధాన స్రవంతి పత్రికలు రోజువారీ అన్వేషించాలి. అదంతా ఒక పెద్ద పరిశోధనా కార్యక్రమం. హడావుడిగా రాసే ఈ శీర్షిక కోసం అంత పరిశోధన అవకాశం లేదు గాని, అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు. ఇటువంటి ప్రకటనల భారీ అంకెలు సాధారణంగా నిజం కావు. పదో వంతు సాకారమైతే చాలా ఎక్కువ. చాలా సందర్భాలలో అది ఆ ఒక్క ఏడాదిలో కాక, రానున్న పది పదిహేనేళ్ల ప్రణాళిక అయి ఉంటుంది. ప్రకటించే ఉద్యోగ కల్పన సంఖ్య సాధారణంగా పచ్చి అబద్ధం అయి ఉంటుంది.
ముందే చెప్పినట్టు ఈ దావోస్ ప్రగల్భాలలో ఒక్కొక్కదాన్నీ తీసుకుని వివరంగా పరిశోధిస్తే, తవ్వుతూ పోతే ఎన్నెన్నో అక్రమాలను తవ్వి తీసి గ్రంథాలే రాయవచ్చు. ఒక్క ఉదాహరణ చూద్దాం: 2022లో ‘‘దావోస్ లో కేటీఆర్ జోరు… తెలంగాణకు పెట్టుబడుల మీద పెట్టుబడులు’’ అని 2022 మే 24న జీ న్యూస్ రాసింది. ఇటువంటి పెగ్గెల రాతలను అడ్వర్టోరియల్ అంటారు. ఆ వార్తాస్థలాన్ని వ్యాపార ప్రకటన స్థలంగా భావించి దాని ధర చెల్లిస్తే ప్రకటనలా కాకుండా వార్తలా రాసి గౌరవనీయత సంపాదించి పెడతారు. 2023 జనవరి లో కేటీఆర్ రు. 21,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుడిరాయని, అందులో రు. 16,000 కోట్లు ఒక్క మైక్రోసాఫ్ట్ నుంచే వస్తున్నాయని, అదేదో ఆ క్షణం వచ్చేసినట్టుగా ప్రకటించారు. కాని ఏడాదిన్నర తర్వాత, 2024 మేలో, సెప్టెంబర్ లో వార్తా పత్రికలు రాసిన ప్రకారం ఆ రు. 16,000 కోట్ల పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ పెట్టిన కాలవ్యవధి రానున్న 15 సంవత్సరాలు!
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో పదో వంతయినా వచ్చే పద్దులా రాని పద్దులా ఇంకో ఏడాదికో రెండేళ్లకో గాని కచ్చితంగా చెప్పలేం. కాని గత సంవత్సరపు కాంగ్రెస్ ప్రగల్భాలనూ, అంతకు ముందరి భారతీయ రాష్ట్ర సమితి ప్రగల్భాలనూ కొంతవరకు విప్పి చూడవచ్చు. ఈ కంపెనీల పేర్లూ, పెట్టుబడుల అంకెలూ, ఉద్యోగ కల్పనా అంకెలూ అన్నీ చెరువులో బర్రెను నిలబెట్టి బేరం ఆడడం లాంటివి. వీటిని పేరుకు మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు) అంటున్నారు గాని, అవి ఎక్కువభాగం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ). ‘మీరు ఉచితంగానో, తక్కువ ధరకో, మంచి రవాణా సౌకర్యాలున్న భూమి ఇస్తే, దానికి రహదారులు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే, చుట్టుపట్ల మేధా శ్రామికులు, దేహ శ్రామికులు చౌకగా దొరుకుతారని హామీ ఇస్తే, మా ఉత్పత్తి ప్రారంభమయ్యాక మా అమ్మకాల మీద పన్ను రాయితీలు, పన్ను సెలవులు ఇస్తే, మేం మా పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తాం’ – ఇదీ ఆ కార్పొరేట్ గద్దల ఆసక్తి వ్యక్తీకరణ. ‘మీరడిగినవన్నీ ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం’ అని ఇతర రాష్ట్రాలూ, ఇతర దేశాలూ కూడా ఆ రాబందుల ముందర క్యూలు కట్టి ఉంటాయి. ఆ రాబందులు ఏ మృతదేశం (దేహం కాదు, దేశమే) ఎక్కువ రుచిగా ఉంటుందా అని అంచనాలు వేసుకుంటూ ఉంటాయి. ఎకనామిక్ హిట్ మెన్ ఎంత సమర్థతతో ఆ అంచనాలు వేసిపెడతారో ‘ఒక దళారీ పశ్చాత్తాపం’లో వివరంగా చదివే ఉన్నాం. అందువల్ల ఆ రోజు అక్కడ ప్రకటించే వేల కోట్ల రూపాయలు మన దగ్గరికే రానూ వచ్చు, రాకపోనూ వచ్చు.
ఒకవేళ వచ్చినా అది రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకూ ఏమీ ప్రయోజనకరం కాదు. వాళ్లు వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామన్న చోట, వంద కోట్లకు తగ్గించవచ్చు. అది భవన నిర్మాణాలకా, యంత్ర సామగ్రి కొనుగోలుకా, సిబ్బంది జీతభత్యాలకా వివరాలు చెప్పరు. భవన నిర్మాణ కార్మికుల కూలీ, యంత్ర సామగ్రి హమాలీల కూలీ, వందమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న చోట పది మందికి కల్పిస్తే ఆ పది మంది జీతాభత్యాలు మాత్రమే రాష్ట్ర ఆదాయంలోకి వస్తుంది. ఆ పది మంది సిబ్బందిలో సగం కూడా స్థానికులు కాకపోవచ్చు. ఇంతగా మన రాష్ట్రానికీ, మన సమాజానికీ, మన ప్రజలకూ ఏ ప్రయోజనమూ చేకూర్చకపోయినా, ఇది ‘‘మన రాష్ట్ర అభివృద్ధి, వేల, లక్షల కోట్ల రూపాయలు ప్రవహించబోతున్నాయి, ఇక ఇక్కడ పాలూ తేనే ప్రవహిస్తాయి’’ అని ప్రచారం చేసి ప్రజల మద్దతు, ముఖ్యంగా అమాయక మధ్యతరగతి మద్దతు కూడగట్టినందుకు రాజకీయ నాయకత్వానికి కూలీ కింద గట్టి ముడుపులే దక్కుతాయి. అలాగే ఈ పనులకు అనువుగా చట్టాలను వ్యాఖ్యానించినందుకు, మార్చినందుకు అధికార యంత్రాంగానికి కూడా పెద్ద కూలీయే గిడుతుంది. అలా రాజకీయ నాయకులకూ, అధికారులకూ పరకో, పాతికో పారేసినా, కార్పొరేట్ సంస్థలకు ఇక్కడ అందిన సౌకర్యాల వల్ల, చౌక శ్రమ వల్ల, పన్నుల రాయితీల వల్ల ఇబ్బడి ముబ్బడి లాభాలు దక్కుతాయి.
ముందే చెప్పినట్టు ఈ దావోస్ ప్రగల్భాలలో ఒక్కొక్కదాన్నీ తీసుకుని వివరంగా పరిశోధిస్తే, తవ్వుతూ పోతే ఎన్నెన్నో అక్రమాలను తవ్వి తీసి గ్రంథాలే రాయవచ్చు. ఒక్క ఉదాహరణ చూద్దాం: 2022లో ‘‘దావోస్ లో కేటీఆర్ జోరు… తెలంగాణకు పెట్టుబడుల మీద పెట్టుబడులు’’ అని 2022 మే 24న జీ న్యూస్ రాసింది.
ఇటువంటి పెగ్గెల రాతలను అడ్వర్టోరియల్ అంటారు. ఆ వార్తాస్థలాన్ని వ్యాపార ప్రకటన స్థలంగా భావించి దాని ధర చెల్లిస్తే ప్రకటనలా కాకుండా వార్తలా రాసి గౌరవనీయత సంపాదించి పెడతారు. 2023 జనవరి లో కేటీఆర్ రు. 21,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుడిరాయని, అందులో రు. 16,000 కోట్లు ఒక్క మైక్రోసాఫ్ట్ నుంచే వస్తున్నాయని, అదేదో ఆ క్షణం వచ్చేసినట్టుగా ప్రకటించారు. కాని ఏడాదిన్నర తర్వాత, 2024 మేలో, సెప్టెంబర్ లో వార్తా పత్రికలు రాసిన ప్రకారం ఆ రు. 16,000 కోట్ల పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ పెట్టిన కాలవ్యవధి రానున్న 15 సంవత్సరాలు!