తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మలుపు

– వారాల ఆనంద్

ఈ నవల వెలువడినప్పుడు తెలుగు పాఠకులు తొలిసారిగా కథతోపాటు తమమనసులను కూడా  చదివారు. నిజానికి అది కేవలం కథకాదు, మనిషి మానసిక విరామాల డైరీ. చెదిరిన ఆత్మ గాలిపటం. ఇందులో “అసమర్థుడు”  ఒకవ్యక్తి కాదు. సమాజం అర్థం చేసుకోలేని ప్రతి ఒక్కరూ అసమర్థులే. జీవితాన్ని ప్రశ్నించే ప్రతి ఆలోచనా, తన స్వప్నాల ముందు ఓడిపోయిన ప్రతి హృదయం ఈ నవలలో పాత్రలే. గోపీచంద్ చూపించింది ఎవరో సీతారామారావు అనేవ్యక్తి వైఫల్యంకాదు. అది సమాజపువైఫల్యం. మనిషిని అర్థం చేసుకోలేని కుటుంబవ్యవస్థ వైఫల్యం. ఆలోచించే మనసును ఒంటరితనానికి గురిచేసే ఈ సమాజపు క్రూరత్వం. “మానవులు జీవనదుల్లా ఉండాలి” అన్న గోపీచంద్ మాటల్లో తాత్వికత ఉంది. ఎందుకంటే ఎప్పుడయినా ఎక్కడయినా నిలవనీరు నీరు చెడిపోతుంది, కుళ్ళిపోతుంది. అట్లే ప్రశ్నించడం ఆపిన మనుషులు కూడా అలాగే కుళ్ళిపోతారు. అందుకే చలనం వున్న గోపీచంద్ సాహిత్యం నేటికీ సజీవంగా వుంది. అన్వయాన్ని కలిగివుంది. ఇవ్వాల్టి యువతకూడా ఒంటరితనంలో, ఉద్యోగాల ఒత్తిడిలో, సంబంధాల విచ్చినతల్లో, సోషల్ మీడియా నవ్వుల వెనుక దాగివున్న ఖాళీల్లో ‘అసమర్థుడు’ నడుస్తూనే ఉన్నాడు.

గోపీచంద్ 1910 సెప్టెంబర్ 8న కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించాడు. తను ప్రముఖ సంఘసంస్కర్త, హేతువాది త్రిపురనేని రామస్వామి కుమారుడు. అందుకే చిన్ననాటి నుంచే గోపీచంద్ జీవితం ప్రశ్నల మధ్య పెరిగింది. ‘ఎందుకు’ అనే ఒకే ఒక్కప్రశ్న ఆయన ఆలోచనా ప్రపంచాన్ని నిర్మించింది. అదేప్రశ్న ఆయన పెరిగి రచయిత అయిన తరువాత రచనలన్నింటికీ మూలబీజమైంది. హేతువాదం, మార్క్సిజం, మానవతావాదం, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో భావజాలాలను తెలుసుకుంటూ వాటితో సంఘర్షణ పడుతూనే  ఆయన జీవితం సాగింది. అందుకే గోపీచంద్ రచనల్లో మనిషి అంతరంగపు తర్జనభర్జనలు అత్యంత సహజంగా వ్యక్తమవుతాయి.

గోపీచంద్ సాహిత్య ప్రపంచంలో “అసమర్థుని జీవయాత్ర” ఒక మైలురాయి. 1947లో వెలువడిన ఈ నవల తెలుగుసాహిత్యంలో తొలి మనోవైజ్ఞానిక నవలగా గుర్తింపు పొందింది. ‘అసమర్థుని జీవయాత్ర’లో గోపీచంద్ మనిషి మానసికస్థితులను అత్యంతలోతుగా చిత్రించారు. ఆత్మన్యూనత, ఒంటరితనం, జీవితార్థాన్వేషణ, వ్యక్తి సమాజాల నడుమ సంఘర్షణ వంటి అంశాలను అపూర్వమైన విశ్లేషణతో ఆవిష్కరించారు. మనిషి బాహ్య జీవితంకన్నా అంతరంగపు పోరాటమే ఎంత తీవ్రమైందో ఈ నవలలో తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ పాఠకులని కలవరపెడుతుంది. గోపీచంద్ రచనల్లో హేతువాదం ముఖ్యమైన లక్షణం. ఆయనపాత్రలు మూఢనమ్మకాలతో రాజీపడవు. ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తాయి. అదే సమయంలో మానవతా దృక్పథం కూడా అంతే బలంగా ధ్వనిస్తుంది. మనిషి బాధల పట్ల గోపీచంద్ కు అపారమైన సానుభూతి ఉంది. సమాజపు కపట నైతికత, కుటుంబవ్యవస్థల ఒత్తిడి, వ్యక్తిస్వేచ్ఛపై పడే బంధనాలు ఇవన్నీ విమర్శాత్మకంగా కనిపిస్తాయి.

గోపీచంద్ కేవలం నవలారచయిత మాత్రమే కాదు. కథకుడు, వ్యాసకర్త, తాత్వికుడు, సినీదర్శకుడు. “పరివర్తనం”, “గడియపడని తలుపులు”, “చీకటి గదులు”, “మెరుపుల మరకలు”, “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” వంటివి తెలుగుసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి. “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా”కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. గోపీచంద్ రచనలలో వివిధ తత్త్వవేత్తల సమాచారాలున్నాయి, ‘మెరుపుల మరకలు’లో జాన్‌పాల్ సార్త్ర్, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామాలో వైట్‌హెడ్,’ పోస్టు చెయ్యని ఉత్తరాలు’లో రస్సెల్, అరవిందులు, చీకటిగదులలో మార్క్సిస్టులను గురించిన అనేక విషయాలు ఉన్నాయి. గోపీచంద్ నిరంతర అన్వేషకుడు. ఒక భావజాలానికి శాశ్వతబందీ కాలేదు. మార్క్సిజాన్ని అనుసరించినా, దానికి వున్న పరిమితులను గుర్తించాడు. మానవతావాదాన్ని స్వీకరించినా, ఆధ్యాత్మికత వైపు కూడా ప్రయాణించాడు. ఈ నిరంతర అన్వేషణే ఆయనను గొప్ప తాత్విక రచయితగా నిలబెట్టింది  జీవితం అంటే నిరంతర ప్రవాహం. ప్రశ్నించడం ఆగిపోతే జీవితం నిలిచిపోతుంది అన్న సందేశం ఆయన రచనల్లోని అంతరార్థం. మనిషి తనలోని అసమర్థతను, సమాజంలోని విరోధాభాసలను ఎదుర్కోవడానికి గోపీచంద్ రచనలు సవాలు విసురుతాయి. కాలానుగుణంగా మరింత ప్రాసంగికం అవుతున్నాయి.

గోపీచంద్ న్యాయశాస్త్రం చదివి కొంతకాలం న్యాయవాదిగా పనిచేసినప్పటికీ  ఆయన మనసు పూర్తిగా సాహిత్యం, సామాజిక ఆలోచనలవైపే మళ్లింది. పాశ్చాత్య తత్వశాస్త్రం, భారతీయ ఆధ్యాత్మికత, మార్క్సిస్టు భావజాలం ఇవన్నీ ఆయన ఆలోచనాపరిధిని విస్తరించాయి. గోపీచంద్ కొంతకాలం తెలుగు సినిమారంగంలో కూడా పనిచేశారు. సినిమాలకు కథలు, సంభాషణలు రాశారు. అయితే అక్కడి వాతావరణం వాణిజ్య పరిమితులు ఆయన భావాలకు, ఆలోచనా స్వేచ్ఛకు సరిపోలకపోవడంతో గోపీచంద్ సినిమారంగంలో ఎక్కువకాలం కొనసాగలేదు. 1962 నవంబర్ 2న గోపీచంద్ కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *